- 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
- అధికార దుర్వినియోగం, అక్రమాస్తులపై సర్కారుకు ఏసీబీ నివేదిక
- ఎస్‌ఐ స్థాయి నుంచి డీఎస్పీ దాకా లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు
- నేడో, రేపో విధుల నుంచి సస్పెన్షన్ వేటు?
హైదరాబాద్,వెలుగు: డీఎస్పీ భీంరెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార దుర్వినియోగం, పోలీస్ అధికారిగా భీంరెడ్డి సంపాదించిన అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందించారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఆయన జీతం, ఖర్చులు, ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే భీంరెడ్డిపై ప్రాసిక్యూషన్ విచారణ జరిపేందుకు అనుమతి కోరారు. మరోవైపు భీంరెడ్డిపై పోలీస్ శాఖ కూడా చర్యలు ప్రారంభించింది.
ఏసీబీ నివేదిక ఆధారంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. సోమవారం అరెస్ట్ చేసిన భీంరెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన హెల్త్ రిపోర్ట్‌తో సహా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఎస్‌ఐ స్థాయి నుంచే అవినీతి ఆరోపణలు..
నాగర్‌కర్నూల్ జిల్లా జడ్చర్ల ఆలూరు గ్రామానికి చెందిన సంకిరెడ్డి భీంరెడ్డి 1993లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం 1995 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పలు పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నారాయణగూడ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోగా, వనస్థలిపురం ఏసీపీగా, పటాన్‌చెరు డీఎస్పీగా విధులు నిర్వహించాడు. 2003 సంవత్సరంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ కాలం పనిచేశాడు. ఎస్‌ఐ స్థాయి నుంచే భీంరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలోని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. వనస్థలిపురం, పటాన్‌చెరులో పోస్టింగ్ సమయంలో పెద్ద ఎత్తున పొలిటికల్ లాబీయింగ్ జరిగినట్లు సమాచారం.
కర్నాటకలోని భూములపైనే ఏసీబీ ఫోకస్..
రాజకీయ నేతల అండదండలతో వనస్థలిపురం, పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో సివిల్ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు భీంరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హోంగార్డులు, కానిస్టేబుళ్లతో పాటు తన డ్రైవర్ పేరిట బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో పాటు భీంరెడ్డి డైరీలో కొంతమంది పోలీస్ అధికారుల పేర్లతో ఉన్న ఆస్తులను కూడా ఏసీబీ కనుగొన్నట్లు తెలిసింది.
ప్రధానంగా కర్నాటకలోని ఒకే ప్రాంతంలో కొనుగోలు చేసిన 45 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 2 ఎకరాలు, జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూముల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఆ ఆస్తులు బినామీల పేరిట ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులను విచారించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
