- సమన్వయ కమిటీ ఏర్పాటులో జాప్యం ఎందుకు?
- తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రాజెక్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలనే ఆకాంక్షతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వచ్చి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారన్నారు.
మెట్రో ఫేజ్-1 త్వరగా పూర్తి కావాలని, ఫేజ్-2 త్వరగా ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రజల పక్షాన చర్చించారని చెప్పారు. ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రిన్సిపుల్ సెక్రటరీని కమిటీ సభ్యుడిగా ప్రకటించినప్పటికీ కేంద్రం నుంచి రెండు వారాలు దాటుతున్నా ఎటువంటి స్పందన లేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని కమిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. సీఎం రాసిన లేఖలతో పాటు కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా, రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల తరఫున కేంద్ర మంత్రులకు లేఖలు అందజేస్తామని తెలిపారు.
13న ఆల్ పార్టీ ఎంపీలతో సీఎం భేటీ
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై కాంగ్రెస్,బీజేపీ, ఎంఐఎం ఎంపీలతో ఈ నెల 13న సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కానున్నారని మల్లు రవి తెలిపారు. మెట్రో ఫేజ్-1, 2, మూసీ సుందరీకరణ, రీజనల్రింగ్రోడ్డు వంటి కీలక అంశాలపై ఇందులో చర్చిస్తామని పేర్కొన్నారు.
