హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే భర్తీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మేనేజ్‌మెంట్ కోటా పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని కోరింది. ఈ మేరకు మంగళవారం టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డిని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఆధ్వర్యంలోని బృందం కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్ కాలేజీలు అర్హులైన విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా మేనేజ్‌మెంట్ కోటా పేరుతో రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
సీట్ల భర్తీలో పారదర్శకత కోసం అన్ని కాలేజీల బీ-కేటగిరీ సీట్లను ఒకే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. అలాగే మెరిట్ జాబితాను అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ బీబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను మార్చాలని కూడా ఎస్‌ఎఫ్‌ఐ విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు లెనిన్ గువేరా, రమేశ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
