న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాటకు సంబంధించి తమిళనాడు సీఎం విజయ్‌కు వ్యతిరేకంగా డీఎంకే వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి అత్యున్నత న్యాయస్థానాన్ని వేదికగా వాడుకోవద్దని ప్రతిపక్ష పార్టీని మందలించింది. ‘‘అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఒక సీఎం ఏంచేయాలో సుప్రీంకోర్టు నిర్దేశించాలని కోరుకుంటున్నారా? భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై మీరు నిషేధం విధించాలని కోరుతున్నారా? మీరు కూడా ప్రసంగాలు చేసుకోండి.
ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ వ్యవహారంలో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మేం ఎలా ఆదేశాలు ఇస్తాం” అని కోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని డీఎంకే కోరింది. అందుకు న్యాయస్థానం అంగీకరించడంతో దాన్ని ఉపసంహరించుకుంది. సీఎం విజయ్ జులై 10న కరూర్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్బంగా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగపత్రాలు, ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతోవిజయ్ పర్యటన సాక్షులను ప్రభావితం చేయడమే అవుతుందని.. దాన్ని అడ్డుకోవాలని కోరుతూ డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
