జమ్మూ: ప్రతిష్టాత్మక అమర్‌నాథ్ యాత్రకు భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. ఈ యాత్ర ప్రారంభమైన ఐదు రోజుల్లోనే భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో లక్షకు చేరవవుతోంది. మంగళవారం ఒక్కరోజే 31 మంది విదేశీయులతో కలిపి మొత్తం 8,815 మంది భక్తులు జమ్మూ నుంచి అమర్‌నాథ్ క్షేత్రానికి బయల్దేరారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తర్వాత ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లడం ఇదే తొలిసారి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. జులై 7న బయల్దేరిన భక్తుల్లో 5,831 మంది పురుషులు, 2,193 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 598 మంది సాధువులు, 131 మంది సాధ్విలతోపాటు 31 మంది విదేశీ పౌరులు ఉన్నారు.
వీరంతా భారీ భద్రత నడుమ 363 వాహనాల్లో జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి తరలివెళ్లారు. వీరిలో 3,989 మంది భక్తులు బాల్తాల్ మార్గం ద్వారా, 4,826 మంది భక్తులు సాంప్రదాయ పహల్గామ్ మార్గం ద్వారా పవిత్ర గుహ వైపు పయనమయ్యారు. జులై 3న ప్రారంభమైన ఈ వార్షిక యాత్రలో మొదటి నాలుగు రోజుల్లోనే 93,000 మందికి పైగా భక్తులు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచులింగాన్ని దర్శించుకున్నారు. మంగళవారం నాటి రద్దీతో కలిపి ఈ సంఖ్య లక్ష దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
