‘ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టి చంపండి’.. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

‘ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టి చంపండి’.. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

షాద్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళనలో పాలమూరు ఎమ్మెల్సీ ఎన్‌‌‌‌‌‌‌‌.నవీన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. షాద్‌‌‌‌‌‌‌‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌‌‌‌‌‌‌‌పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే రూ.50 కోట్ల ముడుపులు తీసుకున్నారని, ప్రజల పక్షాన నిలవకుండా భూముల జోలికి వస్తే బట్టలూడదీసి రాళ్లతో కొట్టి చంపాలంటూ వివాదాస్పద కామెంట్స్​ చేశారు.

మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌‌‌‌‌‌‌‌నగర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆయన అనుచరులు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఆరోపణలు అసత్యమైతే ఎమ్మెల్యే తమతో కలిసి ఆందోళనలో పాల్గొనాలని, ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అంశాన్ని విరమించుకోకపోతే కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కూడా ఉద్యమంలోకి తీసుకొస్తామని హెచ్చరించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ధర్నాతో చౌరస్తాలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది.

ఎమ్మెల్సీపై కేసు..
నవీన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు షాద్‌‌‌‌‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నలమోని శ్రీధర్ ఆధ్వర్యంలో కంప్లయింట్​ ఇవ్వగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సీతారాం తెలిపారు.

వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి..
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌‌‌‌‌‌‌‌పై ఎమ్మెల్సీ నవీన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి జితేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. రూ.50 కోట్లు కాదు.. రూ.50 తీసుకున్నా ఆధారాలతో చూపించాలని సవాల్​ విసిరారు. వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్సీ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ఎమ్మెల్సీ నవీన్‌‌‌‌‌‌‌‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.