ప్రైవేట్ స్కూళ్లపై ఫేక్ గ్యాంగ్‌‌ల వేధింపులను అరికట్టాలి : ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి

ప్రైవేట్ స్కూళ్లపై ఫేక్ గ్యాంగ్‌‌ల వేధింపులను అరికట్టాలి : ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై బోగస్ విద్యార్థి సంఘాల బ్లాక్ మెయిలింగ్‌‌కు పాల్పడుతున్నారని, ఆ గ్యాంగుల నుంచి రక్షించాలని తెలంగాణ గుర్తింపు పొందిన  స్కూల్ మేనేజ్‌‌మెంట్ల సంఘం(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కొందరు ఆర్టీఐని భూతంలా చూపిస్తూ విద్యాసంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లో ట్రస్మా జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఎస్‌‌ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

కొందరు నకిలీ లీడర్లు ఎంఈఓలపై ఒత్తిడి తెస్తూ స్కూళ్లపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై డీజీపీకి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో ట్రస్మా లీడర్లు రామేశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.