- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
- నష్ట పరిహారం చెల్లించడంతో శాంతించిన ఆందోళనకారులు
పెబ్బేరు, వెలుగు: ఎన్నో ఏండ్ల నిరీక్షణ తరువాత తల్లి అయిన ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని రోజులకే కన్నుమూసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామానికి చెందిన ఇమామ్‌సాబ్, సాబెరా బేగం(35) దంపతులకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది.
పెబ్బేరు పట్టణంలోని జనని ఆస్పత్రిలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా, హైరిస్క్ కేసు కావడంతో డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. జూన్ 28న సాబెరా బేగానికి తీవ్ర రక్తస్రావం కావడంతో మరోసారి ఆస్పత్రిలో చేర్పించగా, డాక్టర్ ప్రియాంక రెడ్డి సిజేరియన్ నిర్వహించారు.
కవలలు(పాప, బాబు) జన్మించగా, శ్వాస సమస్యతో వారిని మహబూబ్‌నగర్‌లోని సుశృత ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే సాబెరా బేగానికి పొటాషియం స్థాయి తగ్గడంతో మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. అక్కడి డాక్టర్లు నిమ్స్‌కు వెళ్లాలని సూచించగా, ఆలస్యమవుతందని నవోదయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్‌లో గర్భసంచి వద్ద మాయ పూర్తిగా తొలగించకుండా, లోపలి కుట్లు సరిగా వేయలేదని డాక్టర్లు చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అనంతరం శస్త్రచికిత్స చేసి చికిత్స అందించినప్పటికీ సోమవారం రాత్రి ఆమె మృతిచెందిందన్నారు. దీంతో మృతదేహాన్ని జనని ఆస్పత్రి ఎదుటకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. అనంతరం పెద్దల సమక్షంలో చర్చలు జరగగా, ఆస్పత్రి యాజమాన్యం నష్టపరిహారం ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లు ప్రియాంక రెడ్డి, జయచంద్రా రెడ్డి వెల్లడించారు.
ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ట్విన్ ప్రెగ్నెన్సీ కావడంతో ఇది హైరిస్క్ కేసు అని, ప్రసవానంతరం రక్తస్రావం, పొటాషియం తగ్గడం వంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తాయని తెలిపారు. అవసరమైన చికిత్స అందించిన తర్వాతే మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు, అక్కడి నుంచి నవోదయ ఆస్పత్రికి రెఫర్ చేశామని, తమ వల్ల ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు.
