- తప్పనిసరిగా అమలు చేయాల్సిందే
- అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో స్టూడెంట్స్ కు అందిస్తున్న మెనూలో రాజీ పడమని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలు, హాస్టల్స్ పై మంగళవారం సెక్రటేరియెట్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాలు క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని గురుకులాలు, హాస్టళ్లను సందర్శించాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్స్‌లో మరింత నాణ్యత పెంపొందించేందుకు, సివిల్స్‌తోపాటు వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పక్కాగా అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ఇతర రాష్ట్రాల్లోని స్టడీ సర్కిల్స్ విధానాలను అధ్యయనం చేసి.. తెలంగాణలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈనెల 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న కులవృత్తుల మేళాలో అన్ని కులాల వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ కమిషనర్, బీసీ గురుకుల సెక్రటరీ ఆకస్మికంగా గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందో.. లేదో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమయదేవి, గురుకులాల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.
