- బిల్లులు రాకపోవడంతో చెల్లించాలని తల్లిదండ్రులకు హుకుం
- డబ్బులు చెల్లిస్తేనే క్లాసులకు అనుమతిస్తామంటున్న స్కూళ్ల యాజమాన్యాలు
- ఫీజులు చెల్లించేంతవరకు అడ్మిషన్లు తీసుకోమంటూ మొండిపట్టు
- వేల ఫీజులు చెల్లించలేమంటూ తల్లిదండ్రుల ఆందోళన
ఆదిలాబాద్, వెలుగు : బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం కింద ప్రభుత్వం పేద ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యతో పాటు వసతి సదుపాయం కల్పిస్తోంది. ఈ స్కీమ్‌లో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్అవైలబుల్స్కీమ్ కింద కొత్తగా ఎంపికైన విద్యార్థులతో పాటు ఇప్పటికే చదువుతున్న వారు కూడా ఫీజులు చెల్లించాలంటూ కొన్ని స్కూళ్లు ఒత్తిడి తీసుకొస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు రావడం లేదని, మీ పిల్లల చదువు భారం మీరే మోయాలని, డబ్బులు చెల్లిస్తేనే క్లాసులకు అనుమతిస్తామంటూ తల్లిదండ్రులకు యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో వేల ఫీజులు తాము ఎక్కడి నుంచి తీసుకురావాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న ఓ విద్యార్థిని తల్లితో కలిసి ఇటీవల కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. యూనిఫాంలు, బుక్స్, దోబీ, మెడికల్ ఫీజు కోసం డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు.
180 స్కూళ్లలో 25 వేల మంది విద్యార్థులు
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఏటా విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వం 1, 5వ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఈ పథకం కింద డే స్కాలర్ కు రూ.28 వేలు, రెసిడెన్షియల్‌కు
రూ. 42 వేలు చెల్లిస్తోంది. అయితే గత మూడేళ్లుగా ఈ ఫీజులు చెల్లించలేదు. ఈ స్కీమ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 180 స్కూళ్లలో 25 వేల మంది విద్యార్థులకు చదువుతుండగా వారికి సంబంధించిన రూ.200 కోట్ల బిల్లులు పెడింగ్ లో ఉన్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి.
అడ్మిషన్లు తీసుకోమంటున్న యాజమాన్యాలు
తమపై ఆర్థిక భారం పడుతోందని, పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకోలేమని, తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించేంతవరకు అడ్మిషన్లు తీసుకోమంటూ స్కూళ్ల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ఓ పక్క బడులు స్టార్ట్ అవుతుంటే.. తాము చెప్పేంతవరకు స్కూల్‌కు రావద్దని పాత విద్యార్థులను ఏటా అడ్డుకుంటున్నాయి.
డే స్కాలర్ విద్యార్థులు రూ.వెయ్యి ఫీజు చెల్లించిన తర్వాతే క్లాసులకు రావాలని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రులకు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా బుక్స్, యూనిఫాం, మెడికల్ ఫీజు, తదితర ఫీజులు చెల్లిస్తేనే తీసుకుంటామని స్పష్టం చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల చేయాలని లేదంటే తమ వద్ద నుంచి ఫీజులు వసూలు చేయవద్దని స్కూళ్లను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
