కాలం మారితే కష్టాలూ మారుతాయి.. అన్నట్లు పాలమూరు కథ కూడా ఇప్పుడు అదే మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు పాలమూరు అంటే... కరువు, వలసలు. ఎండిన పొలాలు. ఉపాధి లేక పొట్టచేత పట్టుకుని దేశం పోయిన (పరాయి ఊరు) బతుకులు.
బతుకుదెరువుకు ఉన్న ఊరును విడిచి ముంబై, సూరత్, గుజరాత్, బెంగళూరు నగరాలకు వలస వెళ్లిన పరిస్థితి. తలాపున కృష్ణమ్మ పారుతున్నా వ్యవసాయానికి నీరులేక, పరిశ్రమలురాక, ఉద్యోగ అవకాశాలు లేక ఊరిలో ఉంటే ఆకలి, ఊరు వదిలితేనే బతుకు అంటూ... దేశ నలు మూలలా పాలమూరు కూలీగా వలసెల్లిన పరిస్థితి.
కానీ ఇప్పుడు పాలమూరు చిత్రం మారుతోంది. కరువు, వలసలు. కన్నీళ్ల బతుకుల జిల్లా ... దేశ రక్షణకు కవచంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు కూలీలను దేశమంతా పంపిన నేల ఇకపై దేశాన్ని కాపాడే బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి వేదిక కానుంది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాలమూరు తన పేరున కొత్త చరిత్రను రాసుకోనుంది.
లక్నో తర్వాత దేవరకద్ర
‘మేక్ ఇన్ ఇండియా – ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా తొలి బ్రహ్మోస్ తయారీ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రారంభమైంది. గతేడాది మే నెలలో భాతర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో, యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ప్రారంభించారు. ఇక ఇప్పుడు రెండో కేంద్రంగా దేవరకద్ర ఎంపిక కావడం తెలంగాణకే గర్వకారణంగా నిలుస్తోంది.
చౌదరిపల్లి, బస్వాయిపల్లి, జీనుగర్ల గ్రామాల పరిధిలో 416 ఎకరాల్లో ఈ ప్రతిష్టాత్మక యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ బ్రహ్మోస్ రాకతో ఏరోస్పేస్‌తోపాటు అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయి. దీంతో దేవరకద్ర పరిసర ప్రాంతాలతోపాటు యావత్తు పాలమూరు జిల్లా రూపురేఖలు మారనున్నాయి. దీంతో ఇప్పటివరకు కరువు, వలసలకు పేరెన్నికగన్న మహబూబ్ నగర్ జిల్లా... డిఫెన్స్ మ్యాప్‌లో చేరిపోనుంది.
ఇప్పటికే తెలంగాణలో డీఆర్‌డీఎల్, ఎన్‌ఎఫ్‌సీ, ఆర్‌సీఐ, బీడీఎల్, మిధానీ, ఈసీఐఎల్, హెచ్‌ఏఎల్ సంస్థలు ఇండియన్ డిఫెన్స్ రంగానికి బలమైన పునాదిగా ఉన్నాయి. ఇక బ్రహ్మోస్ తయారీతో... భారత రక్షణ రంగానికి కవచంగా పాలమూరు నిలవనుంది. దీంతో రాష్ట్రంలో డిఫెన్స్ ఎకోసిస్టమ్ మరింత విస్తరించి భవిష్యత్‌లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు బాటలు వేయనుంది.
పాలమూరు జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ‘మంటిపనికైనా... ఇంటోడు కావాలన్నట్లు.' ఈ జిల్లా బిడ్డగా రుణం తీర్చుకుంటా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.
పదేళ్లు పెండింగ్ లిస్టులో ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పట్టాలెక్కించింది సర్కార్. ఇక ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ పరిశ్రమ ఏర్పాటుకు సైతం వేగంగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. పాలమూరు ఆర్థిక, సామాజిక అభివృద్దికి బాటలు వేయనుంది. ఇంజినీరింగ్, సాంకేతిక, తయారీ రంగాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుంది.
దీంతో ఒకప్పుడు కరువు సీమగా ఉన్న పాలమూరు తన వలసల బాధను చరిత్ర పుటల్లో వదిలి.. ఇప్పుడు దేశరక్షణలో భాగస్వామిగా నిలవబోతోంది. ఇన్నాళ్లు వలసల కన్నీళ్లను మాత్రమే చూసిన నేల... ఇకపై విజ్ఞానం, సాంకేతికత, ఉపాధి, అభివృద్ధికి చిరునామాగా మారనుంది. 'కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లుగా కరువు కథను కంచికి చేర్చి... వికాసం వైపు విజయగాథ రాసే కొత్త అధ్యాయానికి పాలమూరు నాంది పలుకుతోంది.
పాలమూరుపై గత పాలకుల నిర్లక్ష్యం
సమైక్యపాలనలో పాలకుల వివక్షకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది పాలమూరు జిల్లా. స్వరాష్ట్రంలోనైనా తన తలరాత మారుతుందని అందరూ ఆశించారు. ఉద్యమ సమయంలో ప్రధాన నినాదంగా వినిపించిన పాలమూరు కరువు... పాలకులు మారితే.... పాలన మారుతుంది.. తమ బతుకులు మారతాయి అని ప్రజలు భావించారు. కానీ, సమైక్య పాలనలో జరిగిందే... పదేళ్ల స్వరాష్ట్ర పాలనలో సాగిందన్న విమర్శలు ఉన్నాయి.
దీనికి మొదటి పదేళ్లలో పాలమూరుకు ప్రాణాధారంగా నిలిచే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కాకపోవడమే నిదర్శనం. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్నా, కాశ్మీర్ టూ కన్యాకుమారి నేసనల్ హైవే కనెక్టివిటీ ఉన్నా... స్వరాష్ట్రంలో వస్తాయనుకున్న పరిశ్రమలు రాలేదు. ఆశపడ్డ అభివృద్ధి జరగలేదని జిల్లా ప్రజల అభిప్రాయం. చదువులేనివాడు మట్టిపని కోసం వలస వెళ్తే, చదువుకున్నోడు ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ఏముల కొండల్ గౌడ్,మీడియా కన్సల్టెంట్, తెలంగాణ విద్యాకమిషన్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
