తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నూతన చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.175 ప్రకారం ఆయనను నియమించింది. రెరా చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం అదేవిధంగా తెలంగాణ రియల్ ఎస్టేట్స్ రూల్స్ 2017లోని రూల్ 17ని అనుసరించి పురపాలకశాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన 1999 బ్యాచ్‌కి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వకాలంలో ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేశారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు బదిలీపై వచ్చి రోడ్లు, భవనాల కార్యదర్శిగా, పర్యాటక–సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఈ పదవీ విరమణ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం వీరిని రెరా చైర్మన్‌గా నియమించింది.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తిని ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించినప్పుడే పలువురు తెలంగాణవాదులు ఆశ్చర్యపోయారు. కానీ ఎలాంటి అసంతృప్తిని వెలువరించలేదు. ఈ నియామకాలు రచయితలకు, కవులకి అంతగా తెలియవని అనుకుంటాను. తెలిస్తే వాళ్లు ఈ నియామకాన్ని వ్యతిరేకించేవారని అనుకుంటాను. ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడెమీ చైర్మన్‌గా ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తిని నియమిస్తున్నారని తెలిసి ప్రతిఘటించారు. సంయుక్త ప్రకటనను ఇచ్చారు. దాంతో ఆ నియామకం ఆగిపోయినట్టుంది.
రెరా చైర్మన్ నియామకానికి ఎవరు సిఫారసు చేస్తారు?
రెరా చట్టంలోని సె.22 ప్రకారం ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ‘ఎంపిక కమిటీ’ సిఫారసు మేరకు ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. ఈ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి ఉండవచ్చు. లేదా ఆయన నామినేట్ చేసిన న్యాయమూర్తి ఈ కమిటీకి అధ్యక్షత వహించవచ్చు. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు.
తెలంగాణ ప్రజల అదృష్టమో, దురదృష్టమో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే. వారికి ఇక్కడి ప్రజల ఆశలు, మనోభావాలు తెలిసే అవకాశం తక్కువ. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. వారిమాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు తక్కువే. లా సెక్రటరీ కూడా సభ్యుడే. ఆయన జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి. ఆయన ఏమి మాట్లాడగలడు? రాష్ట్ర గృహనిర్మాణశాఖ కార్యదర్శి మాట చెల్లుబాటు అవుతుందని అనుకోం. ఈ ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ దరఖాస్తులను పరిశీలించి చైర్మన్, సభ్యులను సిఫారసు చేస్తుంది. ఈ కమిటీ సిఫారసు ఆధారంగా వారిని ప్రభుత్వం నియమిస్తుంది.
ప్రభుత్వానికి ఈ సిఫారసు నచ్చకపోతే నియామకం ఆగిపోవచ్చు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమంటే ఈ కమిటీలో టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ సభ్యునిగా వేముల శ్రీకర్‌ని ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.170 ప్రకారం నియమించింది. ఇతను ఐఆర్ఎస్‌లో ఎంపికై కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి. ఇతను తెలంగాణకు చెందిన వ్యక్తి. అంతేకాదు వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి. ఈయనను చైర్మన్‌గా నియమించి శ్రీనివాసరాజుని సభ్యునిగా నియమిస్తే కొంతలో కొంత బాగుండేది.తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపడకపోయేవి.
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాలు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో స్థానిక (తెలంగాణ) న్యాయవాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ‘తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం’ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ దశలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన శ్రీనివాసరాజుని రెరా చైర్మన్‌గా సిఫారసు చేయడం, నియామకం జరగడం ఆందోళనను కలిగిస్తుంది.
న్యాయవాదుల సంఘం సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, విడిగా రెండు హైకోర్టులు ఏర్పడినప్పటికీ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన న్యాయవాదులను ఆంధ్రా మూలాలు ఉన్న న్యాయవాదులను తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమించడంపై అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెంది, తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలి. అంతేకాదు జడ్జీల ఎంపిక ప్రక్రియలో సామాజిక, న్యాయ సూత్రాలను పాటించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన న్యాయవాదులకు ప్రాధాన్యతని కల్పించాలి. హైకోర్టు న్యాయవాదులు హైకోర్టులో తమ నిరసనని వ్యక్తపరచి వినతిపత్రాన్ని ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. ఈ నిరసనను వ్యక్తపరచడానికి కారణం ఆంధ్రమూలాలు ఉన్న వ్యక్తులను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తున్నారన్న వార్త తెలిసి హైకోర్టు న్యాయవాదులు ప్రతిస్పందించారు.
ముఖ్యమైన నియామకాల గురించి తెలంగాణవాదులు పట్టించుకోవాలి
ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం పదఘట్టనల కింద తెలంగాణ నలిగిపోయింది. నలిగిపోతోంది. ఇంకా నలిగిపోయే అవకాశం ఉంది. తెలంగాణవాదులు ముఖ్యమైన నియామకాల గురించి పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చాపకింద నీరు మాదిరిగా కాదు వరదలాగ తెలంగాణను ముంచివేస్తున్నారు. వాటి గురించి వివరంగా మరోసారి రాస్తాను.
ఇన్ని ఆంధ్ర నియామకాలు బహిరంగంగా జరుగుతుంటే ఎవరో మామూలు వ్యక్తి ‘ఇడుపు కాగితం’ అన్న పదబంధం మీద చేసిన వ్యాఖ్య మీద ఎక్కువ స్పందించారు. నిజానికి వాళ్లు పట్టించుకోవాల్సింది. నియామకాల గురించి. ఈ నియామకాలు అన్నీ మెరిట్‌తో సంబంధం ఉన్నవి కావు. ఇష్టాఇష్టాలు మీద జరుగుతున్న నియామకాలు. ఏపూరి సోమన్న తన గీతంలో చెప్పినట్టు ‘ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ’ కాకుండా ఏ ఆంధ్రా సామాజికవర్గం పాలవుతుందిరో తెలంగాణ ఎవరి అనుయాయుల పాలవుతుందిరో తెలంగాణ అని పాడుకోవాల్సి ఉంటుంది.
కొలీజియంలో తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఒక్కరు కూడా లేరు
హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కొలీజియం ద్వారా జరుగుతుంది. ప్రస్తుతం కొలీజియంలో తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఒక్కరు కూడా లేకపోవడం ఓ విషాదం. తెలంగాణ ఏర్పడిన పరిస్థితులు వేరు. మిగతా రాష్ట్రాలు ఏర్పడిన పరిస్థితులు వేరు. తెలంగాణ భాషమీద, సంస్కృతిమీద, వనరుల మీద, ఉద్యోగాల మీద జరిగిన దాడి తెలిస్తే తప్ప తెలంగాణవాదుల బాధ తెలియదు. ఇక్కడొక విషయం చెప్పాలి.
ఏ న్యాయవాది అయినా ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. న్యాయ మూర్తులుగా ఎంపిక కావొచ్చు. రాజ్యాంగం చెప్పింది అదే. కానీ అది తెలంగాణవాదుల విషయంలో జరగడం లేదు. తెలంగాణలో అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన ఓ సీనియర్ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపిస్తే ఆయనను అవహేళన చేసినట్టు తెలిసింది. అలాంటి సంఘటన ఒక్కటి కూడా తెలంగాణలో జరగలేదు. జరగకపోవచ్చు కూడా.
తెలంగాణ హైకోర్టులో ఆంధ్రా న్యాయ మూర్తులు ఉన్నారు. తెలంగాణ న్యాయవ్యవస్థలో అంటే జిల్లా న్యాయవ్యవస్థలో ఎంతోమంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక్క న్యాయమూర్తి కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి లేడు. జిల్లా జడ్జీల కోటా నుంచి హైకోర్టుకి ఎలివేట్ అవ్వడానికి ఒక్క వ్యక్తి కూడా లేడు. తెలంగాణకు చెందిన న్యాయవాదిని ఒక్కరినైనా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేయగలరా? అది కూడా ఊహించలేం.
- డా. మంగారి రాజేందర్ మాజీ సభ్యుడు,తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
