పాఠ్యాంశంలో .. రాజ్యాంగ స్ఫూర్తిని చెరిపేస్తే ఎలా? రాజ్యాంగ పీఠిక రాజ్యాంగానికి ఆత్మ

పాఠ్యాంశంలో .. రాజ్యాంగ స్ఫూర్తిని చెరిపేస్తే ఎలా? రాజ్యాంగ  పీఠిక రాజ్యాంగానికి ఆత్మ

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే  అత్యుత్తమ ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో ఒకటి.  రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన  న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలే  భారత  ప్రజాస్వామ్యానికి పునాదులు. అందుకే రాజ్యాంగ  పీఠికను రాజ్యాంగ ఆత్మగా అభివర్ణిస్తారు. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం.  భావి పౌరులైన విద్యార్థులకు రాజ్యాంగ పీఠికను పరిచయం చేయడం,  ప్రత్యేక పాఠ్యాంశంగా పెట్టడం విద్యా వ్యవస్థ ప్రాథమిక బాధ్యత.  కానీ ఇటీవల ఎన్‌‌సీఈఆర్‌‌‌‌టీ  తొమ్మిదవ తరగతి సాంఘిక పాఠ్యపుస్తకాల నుంచి  పీఠికను తొలగించింది.

సెక్యులర్‌‌, సెక్యులరిజం అనే పదాలకు సంబంధించిన ప్రస్తావనలను కూడా నూతన ఎడిషన్‌‌ నుంచి తొలగించింది.  పీఠికలోని  సామ్యవాద, లౌకిక,  ప్రజాస్వామ్య, గణతంత్రం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం,  సౌభ్రాతృత్వం వంటి విలువలు భారత  ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు.  

ప్రతి పౌరుడు తన జీవితంలో  ఆచరించాల్సిన  ప్రజాస్వామ్య సంస్కృతిని విద్యార్థులకు  రాజ్యాంగ పీఠికను  పరిచయం చేస్తుంది.  ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల  బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలంటే  రాజ్యాంగ విలువలను విద్యలో మరింత బలోపేతం చేయాలి.

విద్య అసలు లక్ష్యం

ఆధునిక కాలంలో విద్య కేవలం ఉపాధి సాధనంగా మారిపోతుండగా,  విలువల ఆధారిత విద్య క్రమంగా బలహీనపడుతోందనే  ఆందోళన  వ్యక్తమవుతోంది.  పరీక్షలు,  మార్కులు, ఉద్యోగాలకే  ప్రాధాన్యం పెరుగుతోంది. దీనివల్ల సమాజ సమస్యలను  విశ్లేషించే,  ప్రశ్నించే, రాజ్యాంగబద్ధమైన  పరిష్కారాలను అన్వేషించే  పౌరుల కంటే,  సమాచారం మాత్రమే కలిగి ఉండే విద్యార్థులను తయారుచేసే  ప్రమాదం ఉంది.  

మరోవైపు విద్యార్థుల్లో  హేతుబద్ధత, తర్కం,  ప్రశ్నించడం, విమర్శనాత్మక ఆలోచన, ఆధారాలను పరిశీలించడం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం, శాస్త్రీయ దృక్పథంతో  సమస్యలను విశ్లేషించడం అంశాలు కనుమరుగవుతున్నాయి.  

ఇది విద్య లక్ష్యానికి విరుద్ధం. మరోవైపు నేటి డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల ప్రభావం,  తప్పుడు సమాచారం, విద్వేషపూరిత ప్రచారం,  మత, -కుల ధ్రువీకరణ వంటి సవాళ్లు  పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, లౌకికత, సమానత్వం, సౌభ్రాతృత్వం, శాస్త్రీయ దృక్పథం వంటి అంశాలను మరింత బలంగా బోధించాల్సిన అవసరం ఉంది. ఇవే వారిలో వివేచనను పెంపొందించి, అసత్య ప్రచారాన్ని ప్రశ్నించే సామర్థ్యాన్ని పెంచుతాయి.

పాఠ్యాంశాల మార్పులతో వివాదాలు

నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సహకార భావన, సమర్థవంతమైన సంభాషణకు ప్రాధాన్యత ఇచ్చింది. వీటిలో విమర్శనాత్మక ఆలోచనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. విద్యార్థులు ఏ విషయాన్నైనా హేతుబద్ధంగా విశ్లేషించడం, ఆధారాలను పరిశీలించడం, ప్రశ్నించడం, భిన్నాభిప్రాయాలను  గౌరవించడం వంటి సామర్థ్యాలను పెంపొందించడమే దీని ఉద్దేశ్యం. కానీ పాఠ్యాంశాల కూర్పు దీనికి విరుద్ధంగా  కొనసాగుతోంది. 

ఇప్పటికే  ఎన్‌‌సీఈఆర్‌‌‌‌టీ  పాఠ్యపుస్తకాలలో చేసిన  పలు మార్పులు దేశవ్యాప్తంగా చర్చకు,  విమర్శలకు దారితీశాయి.  చరిత్ర, మొఘల్ పాలకులు, గుజరాత్ అల్లర్లు, డార్విన్ పరిణామ సిద్ధాంతం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ అంశాలు తొలగింపు,  న్యాయవ్యవస్థ అవినీతిని చేర్చడం వంటి అంశాలు దేశవ్యాప్తంగా వివాదాలకు దారితీస్తున్నాయి. 

ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల నుంచి న్యాయవ్యవస్థలో అవినీతి వంటి చర్చనీయాంశాలను తొలగించింది. అయితే రాజ్యాంగ విలువలను పరిచయం చేసే పీఠికను పాఠ్యాంశాల నుంచి తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. 

సమాజంలో న్యాయవ్యవస్థ పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ విలువలపై చర్చ మరింత అవసరమైన సమయంలో ఇటువంటి మార్పులు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను పరిమితం చేసే ప్రమాదం ఉంది. ఈ మార్పులు ఒక వర్గ ఆధిపత్య భావజాలాన్ని  ప్రతిబింబిస్తూ,  సామాజిక  విభేదాలను పెంచే అవకాశముంది.  

వీటిపై విద్యావేత్తలు, చరిత్రకారులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసంఘాల నుంచి అభ్యంతరాలను ఎదురవుతున్నాయి.   విద్యలో విమర్శనాత్మక ఆలోచన, రాజ్యాంగ విలువలు, శాస్త్రీయ దృక్పథం బలోపేతం కావాల్సిన సమయంలో ఇటువంటి మార్పులు విద్యా వ్యవస్థపై అనవసర వివాదాలకు కారణమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజ్యాంగ పీఠికనే తొలిపాఠం

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు. కానీ రాజ్యాంగ విలువలు మాత్రం శాశ్వతమైనవి. వాటిని రాజకీయ దృక్కోణాలతో కాకుండా జాతీయ దృక్కోణంతో చూడాల్సిన అవసరం ఉంది.  రాజ్యాంగం ఏ ఒక్క పార్టీకి చెందినది కాదు,  అది భారత ప్రజలందరి సామూహిక సంకల్పానికి  ప్రతీక.  ఈ క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాతలు భావితరాలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో,  శాస్త్రీయ దృక్పథంతో,  మానవీయ విలువలతో ఎదగాలని ఆకాంక్షించారు.  అందుకే  పాఠశాల దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన కల్పించడం అత్యంత అవసరం.  

సమానత్వం, లౌకిక, సామాజిక న్యాయం వంటి విలువలను ఆచరణలోకి తీసుకురావడానికి రాజ్యాంగ పీఠికే తొలి పాఠం.  రాజ్యాంగాన్ని రక్షించడం అంటే కేవలం చట్టాలను గౌరవించడం మాత్రమే కాదు, దాని విలువలు, ఆదర్శాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని  భావితరాలకు అందించడమూ అంతే ముఖ్యమైన బాధ్యత. అందుకే రాజ్యాంగ  పీఠికను ప్రతి తరగతి పాఠ్యాంశాల్లో చేర్చి, విద్యార్థులకు రాజ్యాంగ విలువలను చేరవేయడం కాలానుగుణ అవసరం.  

రాజ్యాంగ స్పృహ, శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, వైవిధ్యాన్ని గౌరవించే  దీనివల్ల  సమాజ  సమస్యలను విశ్లేషించే,  ప్రశ్నించే, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అన్వేషించే పౌరుల తయారుచేసే పాఠ్యాంశాలను చేర్చాలి.

- సంపతి రమేష్, సోషల్​ ఎనలిస్ట్​-

 గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.