హైదరాబాద్ లో రోడ్లు అధ్వానం..ధర పెరిగిందని పనులు చేయని కాంట్రాక్టర్లు

హైదరాబాద్ లో రోడ్లు అధ్వానం..ధర పెరిగిందని పనులు చేయని కాంట్రాక్టర్లు
  • ఇరాన్–అమెరికా వార్ తో బీటీ షార్టేజ్, రవాణా సమస్యలు 
  •     ఏజెన్సీలకు రేట్లు పెంచాలని సర్కారుకు బల్దియా ప్రతిపాదన
  •     ఓకే చెప్తేనే కొనసాగనున్న పనులు

 హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రపంచంలో ఎన్నో సమస్యలు సృష్టిస్తున్న అమెరికా–ఇరాన్​వార్​ఇప్పుడు నగరంలో రోడ్ల అధ్వాన స్థితికీ కారణమైంది. వర్షాకాలానికి ముందే సిటీలో రోడ్ల రిపేర్లు పూర్తి కావాల్సి ఉండగా, యుద్ధంతో బీటీకి (బిటుమెన్) తీవ్ర కొరత ఏర్పడింది. ధరలు కూడా భారీగా పెరగడంతో టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో మూడు కమిషనరేట్ల పరిధిలో రోడ్లు గుంతలు, కటింగ్​లతో దర్శనమిస్తున్నాయి. కొత్తగా వేయాల్సిన రోడ్ల పనులు కూడా నిలిచిపోయి పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది.  దీంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. 

బీటీ రేట్లపై ప్రభుత్వానికి ప్రతిపాదన

రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా బీటీ రోడ్ల పనుల బిల్లులను సవరించేందుకు అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ధరలను పరిగణనలోకి తీసుకుని అదనపు చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం నుంచి పర్మిషన్​వచ్చిన వెంటనే నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే, బీటీ రేట్లు తగ్గిన తరువాత తిరిగి పాత ధరలే ఇచ్చేలా ప్రపోజల్స్​పంపామని అధికారులు అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. 

యుద్ధానికి..బీటీ రోడ్లకు ఇదీ లింకు  

ముడి చమురును శుద్ధి చేసే ప్రక్రియలో వివిధ ఇంధన ఉత్పత్తులను వేరు చేసిన తర్వాత చివరగా మిగిలిన దాని నుంచి రోడ్ల నిర్మాణంలో ఉపయోగించే  బీటీ ఉత్పత్తి అవుతుంది. ఎల్పీజీ, పెట్రోల్, నాఫ్తా, కిరోసిన్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్స్ తర్వాత బీటీ వస్తుంది. ఇది క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల ఇరాన్ లో నెలకొన్న యుద్ధం కారణంగా, ట్రాన్స్​పోర్టేషన్​లో ఇబ్బందులు రావడంతో బిటుమెన్ సరఫరా తగ్గింది. 

దీనికి తోడు క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కూడా బీటీ ధరలను అమాంతం పెంచేశాయి. వార్ కి ముందు బీటీ ధర టన్నుకి రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండగా, ప్రస్తుతం టన్నుకి రూ.లక్ష దాటింది. దీంతో గతంలో అంచనా వేసిన రేట్లతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు పనులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.