హైదరాబాద్, వెలుగు: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈఎంఎస్) జూన్ 28న నిర్వహించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) జూన్–2026 సెషన్ ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://natboard.edu.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే,వ్యక్తిగత స్కోర్ కార్డులను జులై 16 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. స్కోర్ కార్డులు వెబ్‌సైట్‌లో కేవలం ఆరు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, కాబట్టి అభ్యర్థులు ముందే డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలని బోర్డు సూచించింది.
ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఒరిజినల్ గుర్తింపు పత్రాల తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాత నేరుగా ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందజేయనున్నారు. నిపుణుల కమిటీ పరిశీలనలో సాంకేతికంగా తప్పుగా ఉన్నట్టు తేలిన ప్రశ్నలకు అభ్యర్థులందరికీ మార్కులు కలిపామని బోర్డు స్పష్టం చేసింది. వివిధ కారణాల వల్ల మొత్తం 20 మంది ఫలితాలను ప్రస్తుతం నిలిపివేశామని వెల్లడించింది. ఈ ఫలితాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అభ్యర్థులు 011-–455–93000 నంబర్‌ను సంప్రదించాలని బోర్డు కోరింది.
