హైదరాబాద్ సిటీ, వెలుగు : నాచారంలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కలిసి భారీగా సింథటిక్ డ్రగ్స్ ను పట్టుకున్నారు. నాచారంలోని హైమా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ట్రేడింగ్ షాపుపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి 5.860 కిలోల ఎన్- బెంజైల్‌పైపరాజైన్ అనే నిషేధిత సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ1.60 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని అక్రమంగా అమ్ముతున్న ముదిగొండ ఈశ్వర్ పై కేసు నమోదు చేసి, నాచారం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. ప్రాథమిక విచారణలో నిందితుడు ఈ ప్రమాదకరమైన డ్రగ్‌ను గుజరాత్ నుంచి తీసుకువచ్చి నగరంతో పాటు బెంగళూరు, ముంబై, ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్ సరఫరా వెనుక ఉన్న ఇతర ముఠా సభ్యుల గురించి ఆరా తీస్తున్నట్టు ఎస్టీఎఫ్ డీఎస్పీ తిరుపతి యాదవ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల టీమ్వెల్లడించింది.
