డ్రగ్స్ పెడ్లర్స్ కంటే.. మావోయిస్టులే నయం : డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ పెడ్లర్స్ కంటే.. మావోయిస్టులే నయం : డీజీపీ సీవీ ఆనంద్
  •     గంజాయి సాగుచేసేవారిని, స్మగ్లర్లను మావోయిస్టులు అదుపులో పెట్టారు: డీజీపీ సీవీ ఆనంద్ 
  •     డ్రగ్స్, గంజాయిని సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపు

ఖమ్మం, వెలుగు: డ్రగ్ పెడ్లర్స్​ కంటే మావోయిస్టులే నయమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. గతంలో మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారని, గంజాయి పండించే వారిని, స్మగ్లర్లను శిక్షించేవారని గుర్తుచేశారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి రవాణా అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. రెండ్రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న డీజీపీ మంగళవారం ఖమ్మంలో క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ఆ తర్వాత ఐజీపీ చంద్రశేఖర్​రెడ్డి, సీపీ సునీల్ దత్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. నట్టింట్లోకి గంజాయి,  డ్రగ్స్ చేరుతున్నాయని, స్కూళ్ల దగ్గర కూడా చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇప్పుడే డ్రగ్స్​ను అరికట్టకుంటే భవిష్యత్తులో ప్రమాదం తప్పదన్నారు. గంజాయి నిర్మూలనకు అందరం కలిసి యుద్దం చేద్దామని పిలుపునిచ్చారు. పెడ్లర్స్, స్మగ్లర్స్, గంజాయి పండించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గంజాయి ఎక్కడ సాగు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాన్ని ఖమ్మం పోలీసులు గుర్తించాలని సూచించారు. ఏపీ, ఒడిశా, చత్తీస్​గఢ్​రాష్ట్రాలకు ఖమ్మం జిల్లా ఎంట్రీ పాయింట్ గా ఉందని, ఈ పాయింట్లను బ్లాక్​ చేస్తే రాష్ట్రంలోకి రాకుండా ఆపగలమన్నారు. ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాలకు బోర్డర్​లో ఉన్న జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి స్మగ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.  

పోలీస్ శాఖలో అవినీతిని కట్టడిచేస్తం 

పోలీస్​వ్యవస్థలో అవినీతిని కట్టడి చేసేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రలోభాలకు సిబ్బంది లొందొద్దన్నారు. ప్రజలకు సేవచేసే అవకాశంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. తాను డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు నెలల్లో ఎస్ఐ, ఆపైన ర్యాంక్​ లో ఉన్న 6,500 మంది పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నట్టు చెప్పారు. ప్రతి పోలీస్​ స్టేషన్​ లో రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

పోలీస్​ శాఖలో ఏఐ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. సోషల్ మీడియాలో అసాంఘిక కార్యకలాపాలను ప్రచారం చేస్తున్నవారిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. ట్రాఫిక్ సిస్టమ్​ ను మెరుగుపరిచేందుకు రోడ్​ సేఫ్టీ అథారిటీ అనే ప్రత్యేక బ్యూరోను తీసుకువస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కన్విక్షన్​ రేట్ తగ్గిపోయిందని, దాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్​ ఫోర్స్​ మెంట్ బాగుందని డీజీపీ ప్రశంసించారు. అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్​సమావేశంలో పాల్గొన్నారు.