లేబర్ కోడ్స్‌‌‌‌పై అందరితో చర్చించాకే రూల్స్‌..తొందరపాటు నిర్ణయాలు ఉండవు: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

లేబర్ కోడ్స్‌‌‌‌పై అందరితో చర్చించాకే రూల్స్‌..తొందరపాటు నిర్ణయాలు ఉండవు: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
  • కార్మికులు, పరిశ్రమల ప్రయోజనాలే లక్ష్యం 
  •     సమతుల్య విధానంతోనే  పారిశ్రామిక ప్రగతి అని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : కేంద్రం ప్రతిపాదించిన కొత్త లేబర్ కోడ్స్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోదని డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి) మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. భాగస్వాములందరితో చర్చించాకే రూల్స్​ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమంతో పాటు పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేలా ఒక సమతుల్య విధానాన్ని (బ్యాలెన్స్‌‌‌‌డ్ అప్రోచ్) అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

పరిశ్రమలు సజావుగా, లాభదాయకంగా నడిచినప్పుడే కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని ఎంసీహెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీలో లేబర్ కోడ్స్‌‌‌‌పై పారిశ్రామిక వర్గాలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన కీలకమైన భాగస్వాముల సంప్రదింపుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కార్మిక న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలు, కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన సిఫార్సులపై విస్తృతంగా చర్చించారు. యాజమాన్యాలు, కార్మిక సంఘాలు పరస్పరం చర్చించుకుని సహేతుకమైన నిర్ణయాలకు వస్తే పరిశ్రమల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. లేబర్ కోడ్స్‌‌‌‌పై పారిశ్రామిక, కార్మిక వర్గాలు ఎలాంటి సంకోచాలు లేకుండా తమ ఓపెన్ ఒపీనియన్‌‌‌‌ను వెల్లడించాలని కోరారు.  

హ్యూమన్​ రిసోర్సెస్​ సిద్ధం చేస్తున్నాం..

రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగానే పరిశ్రమల అవసరాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని వివరించారు. ఇండస్ట్రీస్ డిమాండ్‌‌‌‌కు తగ్గట్టుగా హ్యూమన్ రిసోర్సెస్‌‌‌‌ను సిద్ధం చేసేందుకు గత కొన్ని నెలలుగా పారిశ్రామిక సంఘాలతో నిరంతరం చర్చిస్తున్నామని చెప్పారు. మార్కెట్‌‌‌‌లో ఏయే రంగాలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో ఐడెంటిఫై చేసి యువతకు ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు.

ఇరువర్గాల ప్రయోజనాలు పరిగణనలోకి..

కనీస వేతనాల పెంపు విషయంలోనూ ప్రభుత్వం ఇరువర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సంప్రదింపుల విధానాన్ని అనుసరించిందని మంత్రి గుర్తుచేశారు. గత పదేళ్లుగా కనీస వేతనాల్లో ఎలాంటి సవరణలు లేవన్నారు. ఈ క్రమంలో కార్మికుల కనీస అవసరాలను, అటు పరిశ్రమల ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని ఒక సమతుల్య ప్రతిపాదనను తెచ్చామని, ఇందుకు సహకరించిన పారిశ్రామిక సంఘాలకు థ్యాంక్స్ చెప్పారు. లేబర్ కోడ్స్ అమలును హడావుడిగా ముగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ప్రతి పాయింట్‌‌‌‌పైనా డీటెయిల్డ్‌‌‌‌గా డిస్కషన్ జరగాలని కార్మిక సంఘాల నేతలకు మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే తమ అభ్యంతరాలను, సూచనలను లిఖితపూర్వకంగా ఇస్తే, వాటిపై మరోసారి సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివేక్ భరోసా ఇచ్చారు.