- నిధుల ఖర్చులో నిబంధనలు మీరితే చర్యలు
- నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాల్లో అధికారులు, సర్పంచులకు శిక్షణ
- గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవు
- వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలే గ్రామాభివృద్ధికి కేంద్రబిందువులని, గ్రామాల అభివృద్ధికి కేటాయించిన ప్రతి రూపాయిని నిబంధనల ప్రకారమే ఖర్చు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామస్థాయిలో ఒక్క రూపాయి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(జీపీ ఎస్ఏపీ), 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, వీబీజీ రామ్- జీ చట్టం అమలు, ఉపాధి హామీ పనులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అడిషనల్ కలెక్టర్లు (లోకల్ బాడీస్), ఇంజినీర్ -ఇన్ -చీఫ్‌లు, సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఈఈ(పీఆర్),ఈఈ(ఆర్డబ్ల్యూఎస్) అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీ ఎస్ఏపీ), 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, వీబీజీ రామ్- జీ చట్టంపై క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ రిసోర్స్ పర్సన్లు జిల్లాల్లో సర్పంచులు, కార్యదర్శులు, ఇంజినీర్లకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ శిక్షణకు హాజరుకావడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీబీ జీరామ్- జీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,311 కోట్ల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12 కోట్ల పని దినాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రతి గ్రామంలో నెలకు కనీసం వెయ్యి పని దినాలు కల్పించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎల్-నినో ప్రభావం దృష్ట్యా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమివ్వాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట ఉండేలా చూడాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వెయ్యి వ్యవసాయ బావుల తవ్వకానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డీపీవోలను ఆదేశించారు.
గ్రామపంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేలా సొంత ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
