మల్కాజిగిరి, వెలుగు: అదనపు కట్నం కోసం ఆశ చావని భర్త ఆమెను నిరంతరం వేధించేవాడు. చివరకు గొంతు నులిమి చంపి ఉరి వేసుకుందని నాటకం ఆడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పక్కా సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం అతడిని జీవితాంతం జైల్లోనే ఉండాలని తీర్పు చెప్పింది.
సంగారెడ్డి జిల్లాకు చెందిన పోలీస్ పటేల్ బస్వలింగప్పకు 2018లో పెండ్లయ్యింది. కొంత కాలానికే అదనపు కట్నం తీసుకురావాలని హింసించడం మొదలుపెట్టాడు. అనుమానం పెంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించాడు. 2021 ఆగస్టు 14న రాత్రి మందు తాగి ఇంటికి వచ్చి భార్యను గొంతు నులిమి చంపేశాడు. కేసు నుంచి తప్పించుకోవడానికి ఆమెకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ఆఫీసర్, సీఐ నరసింహ స్వామి నేతృత్వంలో సైంటిఫిక్ ఎవిడెన్స్సేకరించి కోర్టులో పక్కాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్పబ్లిక్ప్రాసిక్యూటర్జి.వి. రామకృష్ణ రావు నేరారోపణ నిరూపించడంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాల భాస్కర్ నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించారు.
