ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ కార్మికులు

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ కార్మికులు
  •     రవాణాశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ
  •     కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం.. ఉద్రిక్తత

హైదరాబాద్, వెలుగు: రవాణాశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ కాంక్రీట్ మిల్లర్ లేబర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులు  ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. వెయ్యి మందికిపైగా కార్మికులు ఆర్టీఏ ఆఫీసు గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లి కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాక్టర్ ట్రాలీకి అదనంగా లిఫ్ట్‌‌‌‌, మిల్లర్ ను తగిలించుకొని వెళ్తుంటే రవాణాశాఖ అధికారులు అడ్డుకొని రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఫైన్ లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కార్మికులను చర్చలకు పిలవాలని జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ ను ఆదేశించారు. దీంతో  కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజుతోపాటు ఇతర ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు. ఇక నుంచి ఫైన్ లు వేయకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.