- వారిని గమనించి ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: పోక్సో కేసులో రిమాండ్ లో ఉన్న వ్యక్తి జైలు నుంచి పరార్ అయ్యాడు. సొంత గ్రామంలో ఉన్నాడని గుర్తించి పోలీసులు వెళ్లగా.. ఆత్మహత్యకు యత్నించి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల కింద ఓ బాలికను పెండ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత నెల 15న పోక్సో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్న అనంతరం మహబూబ్ నగర్ జైలుకు తరలించారు.
కిశోర్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం జైలు గోడ దూకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీజీజీ మహబూబ్ నగర్ కు చేరుకుని విచారణ చేపట్టారు. జైలు అధికారులు, పోలీసులతో కలిసి కిశోర్ కుమార్ కోసం గాలింపు మొదలుపెట్టారు. కిశోర్ తన సొంత గ్రామంలోని పొలం వద్ద ఉన్నాడన్న విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు. వారిని గమనించిన కిశోర్ కుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అతడిని ఆత్మకూరు హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి వనపర్తి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
