కొల్లాపూర్, వెలుగు: ‘ప్రజలు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. ఫైళ్లను పెండింగ్‌లో పెడితే ఎలా? ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు ఫైళ్లను పంపించడం పరిపాలన కాదు. ప్రజల సమస్యలకు చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం చూపాలి.’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అనవసరంగా ఫైళ్లను పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదన్నారు. సోమవారం మంత్రి కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఒరిజినల్ ఫైళ్లు, నోట్ ఫైళ్లు, సంబంధిత రికార్డులను తెప్పించి ఒక్కో అంశాన్ని పరిశీలించారు.
ఫైళ్లు ఏ దశలో ఉన్నాయి? ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఎవరి వద్ద ఆగిపోయాయి? పరిష్కారానికి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అలాగే ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముక్కిడిగుండం, సోమశిల, రామాపురం, ఎల్లూరు, జటప్రోలు, గోపాలపురం, సింగోటం, కొల్లాపూర్, చింతలపల్లి, సోమశిల రోడ్డు, చౌటబెట్ల శివారుకు సంబంధించిన పోడు పట్టాలు, ఆర్‌వోఎఫ్‌ఆర్, రెవెన్యూ, అటవీ భూవివాదాలు, జాయింట్ సర్వేలు, పట్టాదారు హక్కులు, లావోని పట్టాలు, భూ రికార్డుల సవరణ, పీవోటీ రెగ్యులరైజేషన్, భూభారతి, వ్యవసాయ మార్కెట్ యార్డు, హార్టికల్చర్ పాలిటెక్నిక్, పర్యాటక ప్రాజెక్టులతో సహా 16 అంశాలపై మంత్రి రివ్యూ చేశారు.
అర్జిదారులను పిలిపించి సంబంధిత అధికారులంతా ఒకే చోట కూర్చొని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. విచారణ జరిపేందుకు కొంత సమయం తీసుకున్నా అభ్యంతరం లేదని, ఫైళ్లను అనవసరంగా పెండింగ్‌లో ఉంచొద్దని స్పష్టం చేశారు. అనంతరం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తో కలిసి కొల్లాపూర్ ఆర్డీవో, నియోజకవర్గ తహసీల్దార్లతో మీటింగ్ నిర్వహించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
