నమ్మించి రూ.33.75 లక్షల ఆభరణాలు స్వాహా.. ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు

నమ్మించి రూ.33.75 లక్షల ఆభరణాలు స్వాహా.. ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు

పంజాగుట్ట, వెలుగు: వజ్రాలు, బంగారు ఆభరణాలను అమ్మి పెడతామని నమ్మించి, రూ.33.75 లక్షల విలువైన సొత్తుతో ముఖం చాటేసిన ముగ్గురు వ్యక్తులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బషీర్‌‌బాగ్‌‌కు చెందిన సుమిత్ అగర్వాల్ జ్యువెలరీ వ్యాపారం చేస్తుంటాడు. కార్బన్ లక్స్ జ్యువెలరీ సంస్థ నిర్వాహకులు మిహిర్ జనక్‌‌కుమార్ షా, సుంకవల్లి వెంకటరమణ బాబు, ఆయన భార్య సూర్యప్రభలు తాము ఆభరణాలను విక్రయించి ఇస్తామంటూ సుమిత్ దగ్గర 511 గ్రాముల బంగారం, వజ్రాభరణాలను తీసుకున్నారు. 

మొదట వాటికి సంబంధించిన డబ్బును చెల్లించి సుమిత్‌‌కు నమ్మకం కలిగించారు. జూబ్లీహిల్స్‌‌లోని రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ షోరూమ్ కోసం మరికొన్ని ఆభరణాలు కావాలని నిందితులు అడిగారు. దీంతో సుమిత్ 2024 నవంబర్ 21న సుమారు 524 గ్రాముల బంగారం, వజ్రాలు, రంగురాళ్లు కలిపిన రూ.33,75,760 విలువైన ఆభరణాలను అప్పగించాడు. నిందితులు వాటిని తిరిగి ఇవ్వకుండా, డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. బాధితుడు మంగళవారం పంజాగుట్ట ఠాణా​లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.