మియాపూర్లో చంపేసి.. మహారాష్ట్ర బోర్డర్లో కాల్చేసింది...ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మియాపూర్లో చంపేసి.. మహారాష్ట్ర బోర్డర్లో కాల్చేసింది...ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
  •     భర్త కనిపించడం లేదని ఫిర్యాదు
  •     దర్యాప్తులో నిగ్గు తేల్చిన పోలీసులు 

మియాపూర్, వెలుగు: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. అన్నంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి, భర్త నిద్రలోకి జారుకున్నాక.. ప్రియుడితో కలిసి గొంతు పిసికి చంపేసింది. ఆ తర్వాత భర్త మృతదేహాన్ని ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి మియాపూర్ నుంచి మహారాష్ర్టకు తీసుకెళ్లి కాల్చేసి వచ్చింది. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఏడు నెలలపాటు దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరికి భార్యే ఈ హత్య చేసినట్టు తేల్చారు. 

ముగ్గురు నిందితులనూ పోలీసులు తీసుకుని విచారిస్తున్నారని, ఈ కేసు వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించనున్నట్టు సమాచారం. మియాపూర్ అంబేద్కర్​నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మల్లాని పెంటేష్(56) మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. పటాన్‌‌‌‌చెరు సమీపంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి ప్రాంతానికి చెందిన సత్యవతి భర్తతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మియాపూర్ అంబేద్కర్​నగర్‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పెంటేష్‌‌‌‌తో సత్యవతికి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు పుట్టాడు. ఈ క్రమంలో సత్యవతికి మధుసూదన్​రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త పెంటేష్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని హత్య చేయాలని ప్రియుడితో కలిసి సత్యవతి ప్లాన్ చేసింది.

అన్నంలో నిద్రమాత్రలు కలిపి హత్య..

ప్లాన్ ప్రకారం.. గతేడాది నవంబర్ 19న రాత్రి సత్యవతి తన భర్తకు అన్నంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. అన్నం తిన్న అనంతరం పెంటేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సత్యవతి తన ప్రియుడు మధుసూదన్​రెడ్డితో కలిసి పెంటేష్ మొఖంపై దిండు పెట్టి అదిమారు. అనంతరం గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి, అతడి ఫ్రెండ్‌‌‌‌, సత్యవతి కలిసి భర్త మృతదేహాన్ని కారులో వేసుకుని.. మియాపూర్ నుంచి కర్నాటక మీదుగా మహరాష్ట్రలోని తుల్జాపూర్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో పెంటేష్ మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. 

ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ సత్యవతి గత ఏడాది నవంబర్ 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పెంటేష్ 19వ తేదిన ఉదయం పటాన్‌‌‌‌చెరులోని పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని.. మళ్లీ తిరిగి రాలేదని చెప్పింది. ఫోన్ చేస్తే స్పందన లేదని, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదని తెలిపింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీలు, కాల్ రికార్డులతో గుట్టురట్టు  

పెంటేష్ మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 8 నెలలపాటు దర్యాప్తు కొనసాగించారు. ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ,​ భార్య ఫోన్ కాల్ రికార్డులు పరిశీలించిన తర్వాత.. ప్రియుడితో కలిసి సత్యవతే తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సత్యవతి, ప్రియుడు మధుసూదన్​రెడ్డి, అతని స్నేహితుడు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని కాల్చేసిన ప్రాంతానికి మియాపూర్ పోలీసుల బృందం వెళ్లి అక్కడ వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం.