ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO) శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం వడ్డీని జూలై 15లోగా సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేసే ప్రక్రియ ఇప్పటికే వేగంగా కొనసాగుతోందని వెల్లడించింది.
ఈసారి మొత్తం రూ.లక్షా 44వేల కోట్లకు పైగా వడ్డీని ఖాతాదారులకు పంపిణీ చేయనున్నట్లు EPFO తెలిపింది. ఇందుకోసం తొలిసారిగా CITES అనే ఆధునిక డిజిటల్ వ్యవస్థను వినియోగిస్తోంది. ఈ కొత్త సాంకేతిక విధానం ద్వారా వడ్డీ జమ చేసే ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.
►ALSO READ | దమ్ముంటే E20 పెట్రోల్ వల్ల పాడైన ఒక్క కారు పేరు చెప్పండి.. నితిన్ గడ్కరీ ఫైర్
ప్రస్తుతం వడ్డీ జమకు ముందు ఫీల్డ్ స్థాయిలో ఖాతాల వివరాలను మరోసారి పరిశీలిస్తున్నట్లు EPFO వెల్లడించింది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేదా తప్పులు లేకుండా సభ్యుల ఖాతాల్లో సరైన మొత్తాన్ని జమ చేయడమే ఈ ధృవీకరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే వడ్డీ నేరుగా ఖాతాల్లో ప్రతిబింబించనుంది.
ఇప్పటి వరకు పీఎఫ్ వడ్డీ రేటు ప్రకటించిన తర్వాత కూడా ఖాతాదారులు అక్టోబర్, నవంబర్ వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈసారి కొత్త సెంట్రలైజ్డ్ డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో జూలై నెలలోనే వడ్డీ జమ పూర్తయ్యే అవకాశం ఏర్పడింది. దీంతో కోట్లాది మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో వడ్డీని మరింత త్వరగా పొందనున్నారని EPFO స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చేదిగా చెప్పుకోవచ్చు.
