E20 పెట్రోల్ పోస్తే కారు పాడవుతుంది.. మైలేజ్ తగ్గిపోతుంది.. ఇంజిన్ దెబ్బతింటుంది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. E20 పెట్రోల్ వల్ల ఒక్క వాహనం అయినా దెబ్బతిన్నట్లు నిరూపిస్తే చూపించాలని సవాల్ విసిరిన ఆయన.. ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే పెయిడ్ క్యాంపెయిన్లు అంటూ మండిపడ్డారు. భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానంపై అనవసర భయాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
దమ్ముంటే ఒక్క కారు పేరు చెప్పండి..
E20 పెట్రోల్ వల్ల వాహనాలకు సమస్యలు వస్తున్నాయనే ప్రచారాన్ని గడ్కరీ పూర్తిగా కొట్టిపారేశారు. దేశంలో E20 వాడి ఏ కారు పాడైందో ఒక్కటి చూపించండి. అలాంటి ఒక్క కేసు కూడా లేదు అంటూ ఛాలెంజ్ విసిరారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
E20 ఎందుకు తీసుకొచ్చింది కేంద్రం?
భారత్ ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌ను కలిపే లక్ష్యాన్ని ఇప్పటికే సాధించింది. చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి ఏడాది ఇంధన దిగుమతుల కోసం భారత్ సుమారు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని.. ఈ భారాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమని గడ్కరీ వివరించారు.
రైతులకు రూ.45 వేల కోట్ల అదనపు ఆదాయం..
ఇథనాల్ తయారీ వల్ల తన కుటుంబ సంస్థలకు లాభం చేకూరుతుందనే ఆరోపణలపై కూడా గడ్కరీ స్పందించారు. తమ ఫ్యామిలీకి చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ అవి ఇథనాల్‌పై ఆధారపడవని చెప్పారు. మొక్కజొన్నతో ఇథనాల్ తయారీకి అనుమతి ఇవ్వడంతో ఉత్తరప్రదేశ్, బీహార్ రైతులకు అదనంగా రూ.45 వేల కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు. మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.1,200 నుంచి రూ.2,800 వరకు పెరగడం రైతులకు మేలు చేసిందన్నారు.
►ALSO READ | ఏఐ లేఆఫ్స్ సునామీ.. 2026లో రోజుకు 700 మంది టెక్కీల తొలగింపు: లక్షా 20వేల మంది ఇంటికి
E20పై అధ్యయనం ఏమి చెబుతోంది?
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. E10 కోసం రూపొందించిన వాహనాల్లో దీర్ఘకాలం E20 వాడితే ఫ్యూయల్ సిస్టమ్‌లోని రబ్బరు భాగాలు, హోస్‌లు, సీల్స్, ఓ-రింగ్స్ వంటి భాగాలు క్రమంగా పాడైపోతాయని పేర్కొంది. అయితే మెటల్ పార్ట్స్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని, కాలుష్య ఉద్గారాలు కూడా అనుమతించిన పరిమితుల్లోనే ఉన్నాయని తెలిపింది.
ARAI స్టడీలో ద్విచక్ర వాహనాల్లో E20 వాడినప్పుడు E10తో పోలిస్తే ఇంధన వినియోగం సుమారు 2 నుంచి 6 శాతం వరకు పెరిగింది. నాలుగు చక్రాల వాహనాల్లో కూడా తయారీ సంస్థలను బట్టి ఫలితాలు మారాయని వెల్లడించింది. అయినప్పటికీ E20 వల్ల వాహనాలు పెద్దఎత్తున పాడవుతున్నాయనే వాదనకు ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో E20పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమా? లేక అపోహలా? అనే చర్చ ఇప్పుడు మరింత వేడెక్కింది.
