పట్టణాల్లో వరదలు పోటెత్తడానికి కాలువల నిర్వహణలో లోపాలే ప్రధాన కారణం అని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ముస్సోరీలో జరిగిన ఐఏఎస్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సహజ నీటి ప్రవాహాలను, జలమార్గాలను కాపాడితేనే వరదలను సమర్థంగా నియంత్రించగలమని ఆయన చెప్పారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాల్లో వరదలు ముంచెత్తడానికి సహజ జలమార్గాలు ఆక్రమణకు గురికావడమే కారణమని ఆయన విశ్లేషించారు.
హైదరాబాద్‌లో చెరువులు, నాలాల ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా తొలగించడం వల్లే నగరంలో వరద ముప్పు క్రమంగా తగ్గుతోందని కమిషనర్ వెల్లడించారు. గత రెండేళ్లలో హైడ్రా ఏకంగా 2,471 ఎకరాల ప్రభుత్వ, ప్రజా భూములను కాపాడింది. ఇందులో చెరువులు, నాలాల పరిధిలోనే 480 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించామన్నారు.
మొదటి విడతలో భాగంగా 6 చెరువులను పునరుద్ధరించి, 75 ఎకరాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ప్రస్తుతం మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్యాట్నీ నాలా ఆక్రమణలను తొలగించడం ద్వారా చుట్టుపక్కల ఉన్న 8 కాలనీలకు వరద ముప్పు తప్పిందని, అలాగే అమీర్‌పేటలో భూగర్భ డ్రైనేజీ పైపులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల అక్కడ వరదలను నివారించగలిగామని కమిషనర్ వివరించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్, మాన్సూన్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని ఏవీ రంగనాథ్ పునరుద్ఘాటించారు.
