హైదరాబాద్ లో  ఆపరేషన్ థండర్‌బోల్ట్.. మంగర్ బస్తీని జల్లెడ పట్టిన 1,100 మంది పోలీసులు

హైదరాబాద్ లో  ఆపరేషన్ థండర్‌బోల్ట్.. మంగర్ బస్తీని జల్లెడ పట్టిన 1,100 మంది పోలీసులు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా సిటీ పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగర్ బస్తీలో హైదరాబాద్ సిటీ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఆపరేషన్ థండర్‌బోల్ట్ పేరిట కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా సాగిన ఈ మెగా ఆపరేషన్‌లో... ఏకంగా 1,100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. H-NEW, టాస్క్ ఫోర్స్, H-FAST, CCS, CAR తో పాటు స్థానిక సివిల్ పోలీస్ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి బస్తీని జల్లెడ పట్టాయి. ప్రతి ఇల్లూ, ప్రతి సందునూ అంగుళం అంగుళం తనిఖీ చేశారు.

ఈ ఆపరేషన్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో... 150 గంజాయి ప్యాకెట్లు, ఒక కిలో ఎండు గంజాయితో పాటు... 32 దగ్గు సిరప్ సీసాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సోదాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 15 మంది డ్రగ్స్ నేరస్థులను, అలాగే 50 మంది అనుమానిత ఆస్తి నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఇలాంటి ఆపరేషన్లు మున్ముందు కూడా కొనసాగుతాయని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి విక్రయించినా... లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎంతటి వారైనా సరే... కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు.