ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం సెంట్రల్ అడ్మిషన్స్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వనజా ఉదయ్ ఎగ్జామ్స్ డీటేయిల్స్ వెల్లడించారు.
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జూలై 23, 2026న ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.జూలై 23 ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు బి.ఎఫ్.ఏ. (BFA), ఎం.పి.ఏ. డ్యాన్స్ (MPA Dance), ఎం.పి.ఏ. ఫోక్ ఆర్ట్స్ (MPA Folk Arts) కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తారు.అదే రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 3:30 గంటల వరకు ఎం.ఏ. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సు ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరుగుతుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే... బి.ఎఫ్.ఏ., ఎం.పి.ఏ. డ్యాన్స్, ఎం.పి.ఏ. ఫోక్ ఆర్ట్స్ కోర్సులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు... పరీక్ష రాసిన వెంటనే, అంటే అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి నాంపల్లి ప్రాంగణంలోనే ప్రాయోగిక (ప్రాక్టికల్) పరీక్షలు కూడా ఉంటాయి. బి.ఎఫ్.ఏ. ప్రాక్టికల్స్ రాసే అభ్యర్థులు తమ వెంట డ్రాయింగ్ బోర్డు, అవసరమైన పెన్సిళ్లను తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.
ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను జూలై 16, 2026 నుంచి www.pstucet.org వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులందరూ ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
