విమానంలో ఆకాశంలో ఎగురుతుంది.. 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది విమానం.. 20 వేల అడుగుల ఎత్తులో వెళుతుంది.. అలా వెళుతున్న విమానం తలుపులను బలవంతంగా తెరిచి.. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు పైలెట్. అతను ఆషామాషీ పైలెట్ కాదు.. పైలెట్లకు ట్రైనింగ్ ఇచ్చే కోచ్.. చాలా సీనియర్. జూనియర్‌కు విమానం నేర్పిస్తూ పైకి వెళ్లాడు.. నేను దూకి చనిపోతున్నాను.. తర్వాత ఏం చేయాలో తెలుసుగా అంటూ చివరి మాటగా చెప్పి దూకేశాడు.. ప్రపంచంలోనే ఇలాంటి ఆత్మహత్య ఘటన ఇదే ఫస్ట్ అంటున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. అర్జెంటీనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
మధ్య అర్జెంటీనాలోని టోలెడోలో షాకింగ్ ఘటనలో వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగా ఓ పైలట్ కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పైలట్‌ను 42 ఏళ్ల ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ లియాండ్రో ఆండ్రెస్ బెర్టాజోగా గుర్తించారు అధికారులు. బుధవారం (జులై 8) రొసారియో అనే ట్రైనీకి శిక్షణ ఇచ్చేందుకు ఇన్‌స్ట్రక్టర్ లియాండ్రో ఆండ్రెస్ బెర్టాజోగా సెస్నా 150 విమానంతో టేకాఫ్ అయ్యాడు.
విమానం గాల్లోకి లేచి సగం దూరం ప్రయాణించాక ఏమైందో ఏమో మరీ ఒక్కసారిగా ఫ్లైట్ క్యాబిన్ తలుపులు తెరిచి కిందకు దూకేశాడు. దూకే ముందు విమానం ఎలా ల్యాండ్ చేయాలో తెలుసగా అంటూ ట్రైనీకి వివరించాడు. ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కి గురైన రొసారియో.. ఆ షాక్‌లోనే విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. విమానానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు.
ఈ ఘటనపై బెర్టాజో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేసిన పైలట్ ట్రైనింగ్ స్కూల్ డైరెక్టర్ ఎడ్వర్డో అల్వారెజ్ మాట్లాడుతూ.. పైలట్ విమానం నుండి దూకడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఎటువంటి ముందస్తు సంకేతాలు లేవని చెప్పారు. ఈ ఘటనకు ముందు రోజు బెర్టాజో మరో విద్యార్థితో కలిసి విమానంలో వెళ్లాడని తెలిపారు.
విమానంలో తన పక్కన మరో వ్యక్తి ఉండగా బెర్టాజో ఈ విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాడన్నారు. బెర్టాజో మంచి వ్యక్తి అని.. అందరితో చాలా సరదాగా ఉంటాడని తెలిపారు. అలాంటి వ్యక్తి ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ ఊహించని ఘటనతో ట్రైనీ పైలట్ పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోయాడని.. అయినప్పటికీ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడని తెలిపారు.
బెర్టాజోకు ఇన్ స్ట్రక్టర్‌గా అపారమైన అనుభవం ఉందని.. అతను చిలీలో కూడా ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశాడని చెప్పారు. బెర్టాజో మరణానికి దారితీసిన సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
