హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మైనర్లకు వాహనాలు ఇస్తే బండి ఓనర్లకు, మైనర్లకు ఇద్దరి కఠిన శిక్షలు అమలు చేస్తామని తెలిపింది.
మోటార్ వెహికల్ చట్టం సెక్షన్199 ప్రకారం..మైనర్ వాహనాలు నడిపితే 12 నెలల పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది. అంతే కాదు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయమని తెలిపింది.
గతేడాది మైనర్లు వాహనాలునడపడానికి అనుమతించిన కేసులో 4070 వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. పిల్లల భద్రత, ప్రజల భద్రత దృష్ట్యా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు అధికారులు విజ్ణపి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన రిజిస్ట్రేషన్ కోల్పోవడమే కాకుండా, ఏడేళ్లు లైసెన్స్ మంజూరు ఆలస్యం అవుతుందని చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
