Preity Zinta: ప్రీతి జింటాపై AI డీప్‌ఫేక్ వీడియోలు.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

Preity Zinta: ప్రీతి జింటాపై AI డీప్‌ఫేక్ వీడియోలు.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

బాలీవుడ్ నటి, IPL పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ఇంటర్నెట్‌లో తన ఫోటోలను మార్ఫింగ్ చేయడంపై (AI Deepfakes) బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను చేపట్టిన హైకోర్టు, ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చి ఉపశమనం కలిగించింది. ఈ సందర్భంగా ప్రీతి జింటాపై ఏఐ (AI) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని బాంబే హైకోర్టు మెటా, గూగుల్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ మాధవ్ జే. జమ్దార్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. ప్రీతి జింటా వ్యక్తిత్వ హక్కులు (Personality Rights), ప్రచార హక్కులు (Publicity Rights), నైతిక హక్కులు (Moral Rights) ఉల్లంఘించబడినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఆమె అనుమతి లేకుండా రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, ఏఐతో సృష్టించిన కంటెంట్ ఆమె రాజ్యాంగబద్ధమైన మరియు చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కోర్టు పేర్కొంది.

అలాగే ఈ హక్కులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) (వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ) మరియు ఆర్టికల్ 21 (జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ) నుంచి పుట్టుకొచ్చినవని కోర్టు స్పష్టం చేసింది.

ప్రీతి జింటా వాదన ఏమిటి?

తన అనుమతి లేకుండా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, మీమ్స్, ఇతర డిజిటల్ కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ప్రీతి జింటా కోర్టుకు తెలిపారు. దీంతో తన వ్యక్తిత్వ హక్కులు, ప్రచార హక్కులు, కాపీరైట్ చట్టంలోని నైతిక హక్కులు ఉల్లంఘించబడటమే కాకుండా, తన ప్రతిష్ఠకు కూడా నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆమె కోరారు.

చాట్‌బాట్లు, నకిలీ వెబ్‌సైట్లపై కూడా అభ్యంతరం

తన పేరుతో ఏఐ ఆధారిత చాట్‌బాట్లు సృష్టించడం, తనలా మాట్లాడేలా లేదా స్పందించేలా డిజిటల్ కంటెంట్ రూపొందించడం, అలాగే తాను సృష్టించని వెబ్‌సైట్ డొమైన్ పేర్లను తన పేరుతో నమోదు చేయడంపై కూడా ప్రీతి జింటా అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వ లక్షణాలు తన వ్యక్తిత్వ హక్కుల్లో అంతర్భాగమని, వాటిపై పూర్తి నియంత్రణ తనకే ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు

మెటా రియాక్షన్..

ప్రీతి జింటా సూచించిన డీప్‌ఫేక్ లింకులను తొలగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మెటా కోర్టుకు తెలిపింది. అయితే భవిష్యత్తులో నిజమైన ఫోటోలు లేదా చట్టబద్ధమైన కంటెంట్ తొలగింపుపై ముందుగా ధృవీకరణ అవసరమవుతుందని పేర్కొంది. ఈ అంశంపై వివాదాలు తలెత్తితే సంబంధిత పక్షాలు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

గూగుల్, మెటా, ఎక్స్‌లకు కోర్టు హెచ్చరిక..

విచారణ సందర్భంగా మెటా సహా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను జస్టిస్ జమ్దార్ తీవ్రంగా హెచ్చరించారు. ‘మీరు అంతర్జాతీయ సంస్థలను నిర్వహిస్తున్నారు. మీ ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగంపై మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి అక్రమాలపై మీరు కఠిన చర్యలు తీసుకుంటే నేరస్థులు వెనక్కి తగ్గుతారు. అది మీ ప్రతిష్ఠను కూడా పెంచుతుంది. లేకపోతే దేశ పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలో మీ పాత్ర కూడా ఉన్నట్టే అవుతుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Preity G Zinta (@realpz)

ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ స్టార్స్ తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. వారిలో బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్, కరణ్ జోహార్ తదితర ప్రముఖులు తమ వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Preity G Zinta (@realpz)