క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ చాలు.. ఎక్కువ వద్దు బాబూ : అప్పులపై కంట్రోల్ అవుతున్న యూజర్లు

క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ చాలు.. ఎక్కువ వద్దు బాబూ : అప్పులపై కంట్రోల్ అవుతున్న యూజర్లు

క్రెడిట్ కార్డు ఉందంటే ఒకప్పుడు ఎంత ఎక్కువ లిమిట్ ఉంటే అంత గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఖర్చు చేయడానికి క్రెడిట్ కార్డు ఒక్కటే మార్గం కాదని భారతీయులు గుర్తిస్తున్నారు. అవసరానికి మించి అప్పులు చేయడం కంటే ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. యూపీఐ, చిన్న మొత్తాల పర్సనల్ లోన్స్, బై నౌ పే లేటర్ వంటి ప్రత్యామ్నాయాలు పెరగడంతో క్రెడిట్ కార్డుల వినియోగ ధోరణిలో కూడా మార్పులు భారీగానే కనిపిస్తోంది.

2025 మార్చి నుంచి 2026 మార్చి వరకు దేశంలో క్రెడిట్ కార్డులపై ఉన్న మొత్తం బకాయిలు రూ.3 లక్షల కోట్ల వద్దే నిలిచిపోయాయని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఇదే సమయంలో బ్యాంకులు కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేసినప్పటికీ మొత్తం బకాయిల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదట. గత 10 ఏళ్లలో వేగంగా పెరిగిన క్రెడిట్ కార్డు అప్పులు ఇప్పుడు స్థిరపడటం చూస్తుంటే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

ఈ మార్పుకు ప్రధాన కారణం వినియోగదారుల ఆర్థిక ప్రవర్తనలో వచ్చిన మార్పేనని వారు చెబుతున్నారు. రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐని ఎక్కువ మంది ఉపయోగిస్తుండగా, అవసరమైనప్పుడు చిన్న పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, BNPL వంటి ఇతర క్రెడిట్ ఎంపికలను ఎంచుకుంటున్నారు. దీంతో అన్ని అవసరాలకు క్రెడిట్ కార్డుపైనే ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది.

మరోవైపు బ్యాంకులు కూడా రుణాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి, బ్యాంకుతో సంబంధం ఉన్న కస్టమర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో మంచి లోన్ టేకర్స్ సంఖ్య పెరగడంతో చెల్లింపుల ఎగవేత కూడా తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 5 కోట్ల 20లక్షల మంది మాత్రమే క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి 5 మందిలో ఒకరి వద్ద 3 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అదే సమయంలో చాలా మంది ఒకే కార్డుపై భారీగా ఖర్చు చేయకుండా అవసరాన్ని బట్టి వివిధ ఆర్థిక ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.

ముఖ్యంగా యువతలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో క్రెడిట్ కార్డే తొలి రుణ సాధనంగా ఉండేది. ఇప్పుడు మొదటి క్రెడిట్ కార్డు తీసుకునే సమయానికే చాలామందికి పర్సనల్ లోన్ లేదా ఇతర క్రెడిట్ ఉత్పత్తుల ఎక్స్‌పీరియన్స్ ఉంటోంది. దీంతో క్రెడిట్ కార్డు ఇక అప్పు కోసం ఏకైక మార్గం కాకుండా ఒక భాగంగా మారుతోంది. ఈ పరిణామాలు చూస్తే భారతీయ కార్డుదారులు "ఎక్కువ క్రెడిట్ లిమిట్ కంటే అవసరమైనంత లిమిట్ చాలు" అనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అప్పులపై నియంత్రణ, బాధ్యతాయుతమైన ఖర్చు, వివిధ రుణ ఎంపికలను సమతుల్యంగా వినియోగించడం వంటి అలవాట్లు భవిష్యత్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూలమైనవే ఉంటున్నారు ఆర్థిక వేత్తలు. జాబ్ గ్యారెంటీ లేని రోజుల్లో అప్పులు చేయటం కూడా జనాన్ని ఆందోళనకు గురిచేస్తూ జాగ్రత్తపడేలా చేస్తోందని నెటిజన్లు దీనిపై రియాక్ట్ అవుతున్నారు.