సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రమోషన్ అంటే కేవలం టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ సామర్థ్యం, అనుభవం మాత్రమే సరిపోవు. ఒక ఉద్యోగి తన తప్పులను ఎలా ఎదుర్కొంటాడన్నది కూడా కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మైక్రోసాఫ్ట్ ఇంజినీరింగ్ డైరెక్టర్ తాహా హుస్సేన్ అన్నారు. ఈ క్రమంలో ఆయన షేర్ చేసిన అనుభవం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మైక్రోసాఫ్ట్ శాన్‌ఫ్రాన్సిస్కో టీమ్‌లో చేరిన ఇద్దరు సీనియర్ ఇంజినీర్లు నిఖిల్, అఖిల్ కెరీర్ ప్రయాణాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు. ఇద్దరూ ఒకే సమయంలో కంపెనీలో చేరారు. ఇద్దరికీ దాదాపు ఒకే స్థాయి విద్య, అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నాయి. కానీ 3 సంవత్సరాల తర్వాత వారి కెరీర్ దిశ పూర్తిగా మారిపోయింది. నిఖిల్ ప్రిన్సిపల్ ఇంజినీర్ స్థాయికి ఎదిగితే.. అఖిల్ మాత్రం సీనియర్ ఇంజినీర్‌గానే ఉండిపోయాడట. అయితే ఈ ఇద్దరి మధ్య అసలు తేడా టెక్నికల్ నాలెడ్జ్‌లో లేదని హుస్సేన్ చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు వారు రియాక్ట్ అవుతున్న విధానమే వారి కెరీర్ గ్రోత్‌ను నిర్ణయించిందని వెల్లడించారు.
నిఖిల్ తన వల్ల తప్పు జరిగిందని గుర్తిస్తే దాన్ని దాచకుండా వెంటనే టీమ్‌కు తెలియజేసేవాడట. ఏం తప్పు జరిగిందో వివరించి, దాన్ని ఎలా సరిచేయాలో ముందుగానే చర్యలు తీసుకునేవాడు. దీంతో మేనేజర్లకు అతనిపై నమ్మకం పెరిగింది. పెద్ద బాధ్యతలు అప్పగించినా సమస్యలను సమయానికి గుర్తించి పరిష్కరించగలడనే నమ్మతం, ధైర్యం అతడిపై కలిగాయి. కంపెనీ అతడిలో గుర్తించిన ఆ నమ్మకమే కెరీర్ గ్రోత్‌కి కారణమైంది.
మరోవైపు అఖిల్ కూడా మంచి ఇంజినీర్ అని హుస్సేన్ చెప్పారు. అతని పనితీరు చాలా సందర్భాల్లో అద్భుతంగా ఉండేది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన తప్పును అంగీకరించడం కంటే ప్రాజెక్ట్ మార్పులు, తక్కువ సమయం, ఇతర టీమ్‌ల ఆలస్యం వంటి కారణాలను ఎక్కువగా ప్రస్తావించేవాడట. మేనేజర్ల దృష్టిలో ఇది పెద్ద తేడాను సృష్టించింది. ఎందుకంటే లీడర్‌షిప్ స్థానాలకు ఎంపిక చేసేటప్పుడు కంపెనీలు కేవలం ప్రతిభను మాత్రమే కాకుండా బాధ్యత తీసుకునే సామర్థ్యాన్ని కూడా చూస్తాయి.
నిఖిల్ అనే టెక్కీ పనిలో వచ్చిన తప్పులను వైఫల్యాలుగా కాకుండా నేర్చుకునే అవకాశాలుగా చూసాడు. అదే అతనికి మరింత పెద్ద అవకాశాలను తెచ్చిపెట్టింది మైక్రోసాఫ్ట్ కంపెనీలో. అఖిల్ ఇచ్చిన రీజన్స్ సరైనవే అయినప్పటికీ.. అతను ఏం నేర్చుకుంటున్నాడో మేనేజర్లకు స్పష్టంగా తెలియలేదని హుస్సేన్ అభిప్రాయపడ్డారు. టెక్ రంగంలో ఎదగాలనుకునే వారికి ఈ సంఘటన ఒక పెద్ద పాఠం. తప్పులు చేయకుండా ఉండటం కంటే, తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి వేగంగా నేర్చుకోవడం నాయకత్వ లక్షణాలను చూపిస్తుంది. కెరీర్‌లో వేగంగా ఎదగాలంటే నైపుణ్యాలతో పాటు జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యమని ఈ స్టోరీ చెబుతోంది.
