ఈ 7 తప్పులు చేస్తే రూ.2వేలు ఫైన్ కట్టాల్సిందే.. రూల్స్ మార్చేసిన ఇండియన్ రైల్వే

ఈ 7 తప్పులు చేస్తే రూ.2వేలు ఫైన్ కట్టాల్సిందే.. రూల్స్ మార్చేసిన ఇండియన్ రైల్వే

ట్రైన్‌లో ప్రయాణించే ప్యాసింజర్ల కోసం ఇండియన్ రైల్వే రూల్స్ మరింత కఠినతరం చేసింది. ప్రయాణికుల సేఫ్టీ, క్రమశిక్షణ, రైల్వే ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా పలు తప్పిదాలపై భారీ జరిమానాలు విధించేలా చర్యలు తీసుకుంది. టికెట్ లేకుండా ప్రయాణించడం నుంచి మహిళల కోచ్‌లో ఎక్కడం, రైలులో ధూమపానం చేయడం తప్పులకు ఇప్పుడు రూ.2వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరికొన్నింటికి జైలు శిక్షతో పాటు రూ.10వేల వరకూ జరిమానా రూల్స్ తీసుకొచ్చింది కొత్తగా. సో రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ 7 తప్పులు అస్సలు చేయకండి..

1. టికెట్ లేకుండా ప్రయాణిస్తే:
చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తే టికెట్ ఎగ్జామినర్ (TT) వెంటనే చర్యలు తీసుకుంటారు. ప్రయాణించిన దూరం, టికెట్ రకం ఆధారంగా టికెట్ ఛార్జీతో పాటు అదనపు జరిమానా కూడా వసూలు చేస్తారు. అవసరమైతే అక్కడికక్కడే కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది.

2. మహిళల కోచ్‌లో ఎక్కితే:
మహిళల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లలో సరైన కారణం లేకుండా పురుషులు ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటారు. పరిస్థితిని బట్టి జరిమానా విధించడంతో పాటు రైల్వే అధికారులు ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

3. రైలు లేదా స్టేషన్‌లో ధూమపానం:
రైలులో, ప్లాట్‌ఫారంపై లేదా రైల్వే ప్రాంగణంలో సిగరెట్, బీడీ, ఇతర పొగాకు ఉత్పత్తులు తాగితే గరిష్టంగా రూ.2వేల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా చెల్లించకపోతే కేసు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మరింత ఎక్కువ జరిమానా పడొచ్చు.

4. రైల్వే సౌకర్యాలను దుర్వినియోగం:
వెయిటింగ్ హాల్‌లు, రిజర్వ్ చేసిన సీట్లు, ప్లాట్‌ఫారాలు లేదా ఇతర రైల్వే సౌకర్యాలను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయడం, పాడుచేయటం, నిబంధనలు ఉల్లంఘించడం కూడా శిక్షార్హమే. ఇలాంటి చర్యలపై గతంతో పోలిస్తే మరింత కఠినంగా జరిమానాలు విధించనున్నారు.

►ALSO READ | తప్పు UPIకి డబ్బు పంపించారా? ఈ నంబర్లకు కాల్ చేసి వెనక్కి తెచ్చుకోవచ్చు తెలుసా..?

5. అనుమతి లేకుండా వస్తువులు అమ్మేతే:
రైలులో లేదా స్టేషన్‌లో రైల్వే అనుమతి లేకుండా ఆహార పదార్థాలు, బొమ్మలు, ఇతర వస్తువులు అమ్మితే గరిష్టంగా రూ.2వేల వరకు జరిమానా విధించవచ్చు. 

6. రైలు లేదా స్టేషన్‌లో భిక్షాటన:
రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భిక్షాటనను అరికట్టేందుకు కూడా రైల్వే కఠిన చర్యలు చేపట్టింది. భిక్షాటన చేస్తూ పట్టుబడితే రూ.2వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

7. ప్రమాదకర వస్తువులు తీసుకెళ్తే:
పేలుడు పదార్థాలు, మండే స్వభావం ఉన్న వస్తువులు లేదా ఇతర నిషేధిత వస్తువులతో ప్రయాణించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో రూ.10వేల వరకు జరిమానా విధించడంతో పాటు కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణానికి ముందు లగేజీలో నిషేధిత వస్తువులను తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది.