షేర్ మార్కెట్ పడిందని భయమెుద్దు.. ఈ 6 పెట్టుబడి మార్గాలతో డబ్బు గ్రో చేస్కోవచ్చు

షేర్ మార్కెట్ పడిందని భయమెుద్దు.. ఈ 6 పెట్టుబడి మార్గాలతో డబ్బు గ్రో చేస్కోవచ్చు

భారత స్టాక్ మార్కెట్లు ఒక్కరోజులోనే భారీ పతనాన్ని చవిచూసి పెట్టుబడిదారుల సంపదలో రూ.9 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, బలహీనమైన గ్లోబల్ సంకేతాలు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో భయపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే సరైన వ్యూహంతో ముందుకెళ్లడం ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

1. భయంతో అమ్మకాలు చేయొద్దు:
మార్కెట్ పడిపోయిందనే కారణంతో వెంటనే షేర్లు అమ్మేయటం పెద్ద తప్పిదమని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పతనాలు ప్రతి పెట్టుబడి చక్రంలో సహజమే. ఈ సమయంలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించి బలమైన కంపెనీల్లో పెట్టుబడులను క్రమంగా పెంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. తాత్కాలిక హెచ్చుతగ్గుల కంటే దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం బెస్ట్ అని సూచిస్తున్నారు.

2. చౌకగా కనిపించిన ప్రతి షేర్ కొనొద్దు:
ధర పడిపోయిందని ప్రతి షేర్ మంచి పెట్టుబడిగా మారదు. బలమైన బ్యాలెన్స్ షీట్, స్థిరమైన లాభాలు, తక్కువ అప్పులు, సమర్థవంతమైన యాజమాన్యం ఉన్న లార్జ్‌క్యాప్ బ్లూచిప్ కంపెనీలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, యుటిలిటీస్, వినియోగ వస్తువుల వంటి రక్షణాత్మక రంగాల కంపెనీలు మార్కెట్ ఒడిదుడుకుల్లో మెరుగైన స్థిరత్వాన్ని చూపే అవకాశముంది.

3. SIP పెట్టుబడులను ఆపొద్దు:
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ప్రస్తుతం అత్యంత కీలక సలహా SIPలను కొనసాగించడమే. మార్కెట్ పడిపోయినప్పుడు అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీంతో సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. మార్కెట్ ఎప్పుడు కనిష్ఠ స్థాయికి చేరుతుందో అంచనా వేయడం కష్టమే. అందుకే క్రమశిక్షణతో కొనసాగించే SIPలు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలను అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

4. బంగారానికి ప్రాధాన్యత:
ఈక్విటీలతో పాటు బంగారం, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు, అధిక రేటింగ్ ఉన్న డెట్ సాధనాల్లో కూడా పెట్టుబడులు ఉంచడం మంచిది. ఇవి మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందిస్తాయి. బంగారాన్ని అధిక లాభాల కోసం కాకుండా రిస్క్‌ను తగ్గించే సాధనంగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

5. వార్తలు కాదు... దీర్ఘకాల లక్ష్యాలే ముఖ్యం:
రోజూ వచ్చే వార్తల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడిదారులకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అదనపు నిధులు ఉంటే ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా దశలవారీగా పెట్టుబడులు పెట్టడం మంచిది. ఈక్విటీ, బంగారం, డెట్ సాధనాల సమతుల్య కలయికతో కూడిన పోర్ట్‌ఫోలియో దీర్ఘకాలంలో సంపద సృష్టించడానికి కీలకం.

6. రిస్క్ తీసుకోలేని వారికి FDలు బెస్ట్:
మార్కెట్ రిస్క్‌ను భరించలేని ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడి మార్గం. పెట్టిన మూలధనం భద్రంగా ఉండటంతో పాటు ముందుగానే నిర్ణయించిన వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు సాధారణ ఖాతాదారులకు సుమారు 2.60 శాతం నుంచి 7.40 శాతం వరకు వార్షిక వడ్డీ అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ వడ్డీ లభిస్తోంది. కాబట్టి రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకుని సమతుల్య వ్యూహంతో ముందుకెళితే మార్కెట్ ఒడిదుడుకులను అవకాశాలుగా మార్చుకోవచ్చు ఇన్వెస్టర్స్.