బ్యాంకుల్లో డబ్బుల్లేవ్.. డిపాజిట్లతోనే సర్దుబాటు.. తెలంగాణలో ఏ జిల్లా చూసినా ఇదే సీన్

బ్యాంకుల్లో డబ్బుల్లేవ్.. డిపాజిట్లతోనే సర్దుబాటు.. తెలంగాణలో ఏ జిల్లా చూసినా ఇదే సీన్

ప్రతి నెలా ఫస్ట్ వీక్​లో ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పెన్షన్ డబ్బులు డ్రా చేస్తుండడంతో పెద్ద మొత్తంలో నగదు అవసరమవుతోంది. కానీ బ్యాంకుల్లో సరిపడా క్యాష్ అందుబాటులో ఉండడం లేదు. ఏ బ్యాంకు,  ఏ బ్రాంచికి ఎంత నగదు ఇవ్వాలనే విషయమై ఆర్బీఐ గైడ్​లైన్స్ జారీ చేసిందని, ఆ మేరకే చెస్ట్ బ్యాంకుల నుంచి సప్లై చేస్తున్నారని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వచ్చిన డబ్బుల్లో ఎంత నిల్వ ఉందో చూసుకొని మరుసటిరోజు లావాదేవీలకు కావాల్సిన నగదు కోసం ఇండెంట్ పెడుతున్నారు.

 ఒక బ్రాంచికి రూ.10 లక్షలు అవసరమైతే రూ.ఐదారు లక్షలు మాత్రమే వస్తున్నట్టు బ్యాంకర్లు వెల్లడిస్తున్నారు. దీంతో మెజారిటీ బ్యాంకుల్లో రోజువారి డిపాజిట్ల డబ్బును రొటేషన్ చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే... పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంతో దాని ఎఫెక్ట్ డిపాజిట్లపై పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో డిపాజిట్లపై 8.5 శాతం ఇంట్రెస్ట్ ఉండగా, దానిని 6.5 పర్సెంట్​కు తగ్గించడం, వడ్డీ ఆదాయంపై ఇన్కమ్ టాక్స్ వసూలు చేయడం వల్ల బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేయడానికి జనాలు 
వెనుకాడుతున్నారు. 

చలా‘మణి’ తగ్గించడమే లక్ష్యమా? 

 కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీని కంట్రోల్ చేయడంలో భాగంగా యూపీఐ, ఆన్​లైన్ ట్రాన్జాక్షన్లను ఎంకరేజ్ చేస్తోంది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ బ్యాంకులకు గైడ్​లైన్స్​ జారీ చేస్తోంది. అలాగే ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయడంలో భాగంగా త్వరలోనే ప్లాస్టిక్  కరెన్సీని తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో మార్కెట్లో ఉన్న నగదు చలామణిని గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు.

ఏ జిల్లాలో చూసినా ఇదే సీన్​.. 

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఎస్బీఐ, సీసీసీ యూనియన్ బ్యాంక్​లో రోజుకు రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. శ్రీరాంపూర్ ఎస్బీఐ పక్కన గల ఏటీఎంను ఐదు నెలల నుంచి ఓపెన్ చేయడం లేదు. దీంతో ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం యూబీఐ, ఎస్బీలలో నగదు కొరత వల్ల రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు.
    
ఖమ్మం జిల్లాలో లక్ష రూపాయలు డ్రా చేయాలంటే ఒక రోజు ముందుగా సమాచారం ఇవ్వాలని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.  గతంలో ఏ టైంలో వెళ్లినా రూ.5 లక్షల వరకు  నగదు ఇచ్చేవారు. కానీ మూడు నెలల నుంచి లక్ష రూపాయలు కావాలన్నా ఒక రోజు ముందే చెప్పాలంటున్నారు. లేదంటే చెక్, నెఫ్ట్ ట్రాన్సక్షన్స్ చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏటీఎంలలో  కూడా రోజువారీ ట్రాన్సక్షన్స్ 20 వేల వరకు లిమిట్​పెడ్తున్నారు. 

ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తంగా నగదు కొరత తీవ్రంగా ఉంది.  గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బుధవారం రైతులు బారులుతీరారు.  నగదు కొరత ఉండడంతో ఒక్కొక్కరికి రూ.20వేల వరకే అనుమతిచ్చారు. లక్ష రూపాయాలు కావాలంటే ఐదురోజులు వరుసగా బ్యాంకుకు రావాల్సి వస్తోందని అందువల్లే క్యూలైన్లు పెరిగిపోయాయని అధికారులు చెప్తున్నారు. 

భూపాలపల్లి జిల్లాలో రైతులు పదిరోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా చేతికి డబ్బు అందడంలేదు. క్యూలో ముందున్న పది, పదిహేను మంది రైతులకే నగదు దొరుకుతుండడంతో వెనుకాల ఉన్నవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. 
    
కరీంనగర్​ జిల్లాలోనూ అనేక బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. రోజుకు రూ.10 వేల వరకే  క్యాష్​ ఇస్తున్నారు.  ఏటీఎంలు సైతం ఎక్కడికక్కడ మూతపడ్డాయి. దీంతో పనులు వదిలిపెట్టి  వ్యవసాయ పెట్టుబడుల కోసం   రావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 
    
నిర్మల్ జిల్లాలోని అన్ని మండలాలు, ప్రధాన గ్రామాల్లోని గ్రామీణ బ్యాంకు లు నగదు కొరత కారణంగా ఐదు నుంచి పది వేలు నగదు మాత్రమే ఇస్తున్నాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని ఎస్బీఐ లలో మాత్రం లక్ష లోపు నగదు ఇస్తున్నారు. 
    
కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ప్రతి రోజూ ఒక్కొక్కరికి ₹10 వేల నుంచి ₹20 వేల వరకే ఇస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం లక్ష, అంతకు మించి ఇస్తున్నారు. వ్యవసాయ సీజన్​ ప్రారంభమైన తరుణంలో రైతులపై ఇలా వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.  
    
మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో క్యాష్​ కొరత తీవ్రంగా ఉంది.  కురవి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ లో బుధవారం రూ.25వేలు ఇవ్వడానికి గంటల కొద్దీ వేయిట్​చేయించారు. లక్షరూపాయలు కావాలంటే సాధ్యం కాదని  చెప్పేస్తున్నారు.  రోజూ వచ్చి కొద్ది కొద్దిగా తీసుకెళ్లాలని సలహా ఇస్తున్నారు. చెస్ట్​ బ్యాంక్​ నుంచి క్యాష్​ రావడం లేదని,  ఎవరైనా నగదు డిపాజిట్​ చేస్తే  మరొకరికి ఇస్తున్నామని ​ సిబ్బంది చెప్తున్నారు.