రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా ? సామాజిక కార్యకర్త బక్క జడ్సన్

రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా ? సామాజిక కార్యకర్త బక్క జడ్సన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణలో రిటైర్మెంట్  బెనిఫిట్స్  చెల్లింపులో జాప్యంతో రిటైర్డ్  ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్  మరోసారి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.

2025 అక్టోబర్ 13న ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ 2026 జనవరి 6న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 8 వారాల్లో చర్యలు తీసుకొని యాక్షన్  టేకన్  రిపోర్టు(ఏటీఆర్‌‌‌‌)‌‌‌‌ సమర్పించాలని ఆదేశించిందని, అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రిటైర్మెంట్  బెనిఫిట్స్  కోసం ఎదురుచూస్తున్న 25,354 మంది రిటైర్డ్  ఉద్యోగులు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పటికే 100 మంది వరకు మరణించారని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల జనగాం జిల్లాకు చెందిన రిటైర్డ్  టీచర్ పగిడిపల్లి మల్లయ్య తనకు రావాల్సిన రూ. 10.77 లక్షల జీపీఎఫ్  బకాయిలు విడుదల కాకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బుధవారం హైదరాబాద్  గన్‌‌‌‌పార్క్  అమరవీరుల స్తూపం వద్ద నల్ల చొక్కా ధరించి బక్క జడ్సన్ నిరసన తెలిపారు.

పెండింగ్‌‌‌‌లో ఉన్న జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్  ఎన్‌‌‌‌క్యాష్‌‌‌‌మెంట్  తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌‌‌‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రిటైర్డ్  ఉద్యోగుల మరణాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. 2026 జనవరి 6న ఇచ్చిన ఆదేశాల అమలుపై వెంటనే ఏటీఆర్  కోరాలని విజ్ఞప్తి చేశారు.