కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన సింగరేణి కార్మిక నేత, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ తేజావత్ రాంబాబు(70) మృతిచెందారు. కొంత కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు.
పట్టణంలోని ఠాగూర్ నగర్ 700 క్వార్టర్స్ ఏరియాలో నివాసముండే రాంబాబు ఐదు దశాబ్దాలుగా జిల్లాలోని సింగరేణి కార్మికులకు విశేష సేవలందించారు. ఐఎన్టీయూసీ బ్రాంచి వైస్ ప్రెసిడెంట్‌తో పాటు కేంద్ర కమిటీలో, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా, వివిధ హోదాల్లో యూనియన్‌లో పనిచేశారు. కొంతకాలం ఏపీసీఎంఎస్యూనియన్బాధ్యతలు కూడా చేపట్టారు. సింగరేణి కార్మికుల హక్కులు కోసం పోరాటాలు చేశారు.
గిరిజనులకు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించి, ఉపాధి కల్పించడంతో పాటు లంబాడి గిరిజనుల హక్కుల కోసం, వారిని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజునగర్, రాజీవ్‌నగర్ కాలనీల ఏర్పాటులో పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు, స్థానికులు సంతాపం వ్యక్తంచేశారు.
మాజీ ఎమ్మెల్యే సొతుకు సంజీవరావు, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, కాంగ్రెస్ పార్టీ, ఇతర కార్మిక సంఘాల లీడర్లు, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లంబాడి జేఏసీ ప్రజా సంఘాల జేఏసీ బాధ్యులు రాంబాబు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఆరుగురు సంతానం.
