- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
కాగజ్‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జేకే పేపర్ మిల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని, కార్మికులకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.
పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి అదిత ఆధ్వర్యంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి వివేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలతో పాటు ఎన్నికల అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. కార్మికుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని లేబర్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిత తెలిపారు. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిత్యం సానుకూల దృక్పథంతోనే ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు.
