మళ్లీ మొదలైన ఇరాన్-అమెరికా యుద్ధం.. కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లో మోగిన సైరన్‌లు

మళ్లీ మొదలైన ఇరాన్-అమెరికా యుద్ధం.. కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లో మోగిన సైరన్‌లు

ఇరాన్పై అమెరికా మరోసారి మెరుపు దాడులు చేసింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌తో చర్చలు జరపడం సమయం వృథా అని, ఆ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే ఇరాన్పై అమెరికా ఈ దాడులకు పాల్పడటం గమనార్హం.

టెహ్రాన్ టార్గెట్గా గురువారం తెల్లవారుజామున అమెరికా క్షిపణులు దూసుకెళ్లాయి. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు కొనసాగిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.

సిరిక్, బుషెహర్, కొనరాక్, చబహార్‌లలో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా రిపోర్ట్ చేసింది. ఆగ్నేయ చాబహార్ ఓడరేవుపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ ఆగ్నేయ నగరమైన ఇరాన్‌ షహర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ దాడులను ఆపకపోతే అమెరికా బాంబు దాడులు మరింత తీవ్రమవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

అబు మూసా ద్వీపంలో రెండు పేలుళ్లు వినిపించాయి. బుషెహర్‌పై రెండు అమెరికా క్షిపణులు దాడి చేశాయి. జాస్క్‌లో పలు పేలుళ్లు సంభవించినట్లు తెలిసింది. ఇరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో.. పశ్చిమాసియా దేశాలు మరోసారి యుద్ధ భయంతో వణికిపోయాయి.

అమెరికా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి వైమానిక దాడులకు దిగిన క్రమంలో.. ఇరాన్ దాడి చేయవచ్చనే హెచ్చరికగా గురువారం తెల్లవారుజామున కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు క్షిపణి హెచ్చరిక సైరన్‌లను మోగించాయి. మూడు గల్ఫ్ అరబ్ దేశాలలో నష్టం జరిగినట్లు ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. తమ వైపు వస్తున్న డ్రోన్‌లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది.