రేవంత్... 3 నెలలు నన్ను ఇరిగేషన్ మంత్రిని చెయ్.. కాళేశ్వరం నీళ్లు పారించి చూపిస్త.. : హరీశ్‌‌‌‌‌‌‌‌

రేవంత్... 3 నెలలు నన్ను ఇరిగేషన్ మంత్రిని చెయ్.. కాళేశ్వరం నీళ్లు పారించి చూపిస్త.. : హరీశ్‌‌‌‌‌‌‌‌
  • లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంట
  • కన్నెపల్లి మోటార్లను ఆన్​ చేసి బరాబర్​ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తం
  • రేవంత్‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్​ అక్కర్లే.. మేం చాలు
  • అసెంబ్లీ పెడితే అన్ని అంశాలపై చర్చించేందుకు మేం రెడీ
  • మేడిగడ్డ దగ్గర ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ సాకు చూపిస్తున్న ప్రభుత్వం.. దేవాదుల దగ్గర ఎందుకు లిఫ్ట్​ చేయట్లే?
  • కాళేశ్వరం నీళ్లను ఒడిసిపడతడా? లేదా కిందకు ఇడిసిపెడతడా?  చెప్పాలని సీఎంకు డిమాండ్‌‌‌‌‌‌‌‌
  • తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్​

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ దగ్గర నీళ్లు పారుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్‌‌‌‌ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్‌‌రావు ప్రశ్నించారు. మూడేండ్లు కాదు.. 3 నెలలు తనను ఇరిగేషన్​ మంత్రిని చేస్తే నీళ్లు ఎత్తిపోసి.. పారించి చూపిస్తామని, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సీఎం రేవంత్‌‌కు తేల్చి చెప్పారు.

‘‘రేవంత్​.. మూడేండ్లు అవసరం లేదు.. మూడు నెలలు నన్ను ఇరిగేషన్​ మంత్రిని చెయ్‌‌. జీతం తీసుకోను. ప్యూను.. ఫ్యాను అవసరం లేదు. ఎట్ల నీళ్లు రావో మేం చూస్తం. నీళ్లు పారించి చూపిస్తం. నాకేం కొత్తగా పదవి అవసరం లేదు. 13 ఏండ్లు మంత్రిగా చేసిన. నువ్వు సవాల్​ చేసినవ్​ కాబట్టి అంటున్న. కన్నెపల్లి మోటార్లు ఆన్​ చేస్తం.. బరాబర్​ ఎల్లంపల్లికి నీటిని తీసుకొస్తం. ఒకవేళ నీళ్లు తీసుకురాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంట’’ అని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై బుధవారం సీఎం రేవంత్‌‌రెడ్డికి కౌంటర్‌‌‌‌గా తెలంగాణ భవన్‌‌లో హరీశ్‌‌రావు పవర్‌‌‌‌పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు.  కాళేశ్వరంపై చర్చించడానికి సీఎం రేవంత్‌‌కు కేసీఆర్​ రావాల్సిన అవసరం లేదన్నారు. చర్చకు తాము చాలని పేర్కొన్నారు. అసెంబ్లీ పెడతానంటే పెట్టొచ్చని, అన్ని అంశాలపై చర్చించేందుకు తాము రెడీ అని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఇప్పటికిప్పుడు 89 వేల క్యూసెక్కుల వరద పోతున్నదని, 3 టీఎంసీలు ఈజీగా ఎత్తిపోసుకోవచ్చన్నారు. సుందిళ్ల, అన్నారం చెక్కుచెదరలేదని అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వమే చెప్పిందని, తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు తీసుకెళ్తామని మంత్రి ఉత్తమే చెప్పారని గుర్తుచేశారు. మేడిగడ్డ దగ్గర రబ్బర్ డ్యామ్ కట్టి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తి పోసుకోవచ్చని ఆనాడే ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కానీ, ఆ రిపోర్ట్​ ఇచ్చిన ఈఎన్సీని ట్రాన్స్‌‌ఫర్​ చేసి బెంచ్​ మీద కూర్చోబెట్టారని, ఆరు నెలలు పోస్టింగ్​ ఇవ్వకుండానే రిటైర్​ చేశారని మండిపడ్డారు.   

గురుదక్షిణ ఇస్తున్నడు..

కాళేశ్వరం నీళ్లను ఒడిసిపడతడా? లేదా కిందికి ఇడిసిపెడతడా? అనేది సీఎం రేవంత్​ చెప్పాలని హరీశ్‌‌ డిమాండ్‌‌ చేశారు. మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్‌‌ఏ సాకు చూపించి నీళ్లు ఎత్తిపోయని ఈ ప్రభుత్వం.. సమ్మక్కసాగర్​ నుంచి దిగువకు భారీగా వరద పోతున్నా దేవాదుల నుంచి ఎందుకు నీళ్లను ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. దేవాదుల నుంచి 2,500 క్యూసెక్కులు ఎత్తిపోసుకోవచ్చని, అయినా 900 క్యూసెక్కులే లిఫ్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

గురుదక్షిణ కింద చంద్రబాబుకు దిగువకు నీళ్లు వదులుతున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లు పోతుంటే ఎత్తిపోసుకునే సోయి రేవంత్ , మంత్రి ఉత్తమ్‌‌కు లేదన్నారు. నీళ్లు ఉండి కూడా వాడుకోవట్లేదంటే వాళ్లది నేరపూరిత నిర్లక్ష్యమని, వాళ్లను ఉరితీసినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో ఎల్లంపల్లి నుంచి కొండ పోచమ్మసాగర్​ వరకు ఏమీ మారలేదని, అవన్నీ కాంగ్రెస్​ పెట్టిన వ్యవస్థలేనన్నారు. ప్రాజెక్టులో మారిందల్లా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి బదులు.. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి బ్యారేజీలు మాత్రమేనని పేర్కొన్నారు.  మేడిగడ్డ దగ్గర 280 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పడంవల్లే బ్యారేజీ సైట్‌‌ను మార్చామని వివరించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టొద్దు అని రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ చెప్పలేదన్నారు.  

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేస్త

గిపేట, వెలుగు: రేవంత్ రెడ్డి నిలిపివేసిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల సాధన కోసం బోరంచ అమ్మవారి ఆలయం నుంచి త్వరలో పాదయాత్ర చేయనున్నట్లు హరీశ్ ప్రకటించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సంగుపేటలో ఏర్పాటు చేసిన ‘సర్’పై అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ఈ 2 ప్రాజెక్టులను రేవంత్ ఎందుకు బంద్ పెట్టిండో చెప్పాలన్నారు. 

మహారాష్ట్ర ఒప్పుకోలేదు.. 

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం తాము అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర కాళ్లావేళ్లా పడినా ఒప్పుకోలేదని హరీశ్​ చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం లో ఉండి వాళ్లు అడిగితేనే ఒప్పుకోలేదని.. అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్​ ప్రభుత్వ పెద్దలే చెప్పారన్నారు. ‘‘ఆ తర్వాత ఎన్నికలొచ్చి మహారాష్ట్రలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూడా ససేమిరా అంది. 2015 ఫిబ్రవరి 17 న మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో అప్పటి సీఎం కేసీఆర్ సమావేశమైనా ఒప్పుకోలేదు.

ప్రాణహిత –చేవెళ్లకు హైడ్రాలజీ క్లియరెన్స్ రాలేదు. 160 టీఎంసీల నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ 2015 ఫిబ్రవరిలో లెటర్ పంపింది. అదే ఏడాది మార్చిలోనూ మరో లేఖ పంపింది.. 165 టీఎంసీలున్నా ఎగువ రాష్ట్రాలకు 63 టీఎంసీలున్నయ్.. ఆ రాష్ట్రాలు వాడుకుంటే ఉండేది 102 టీఎంసీలే అని చెప్పింది. ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పింది. 2015 మార్చ్ 13 న ఉమాభారతి కూడా లేఖ రాశారు.. 160 టీఎంసీలు లేవని చెప్పారు. రివైజ్ చేసుకోవాలన్నారు. రెండున్నరేండ్లలో మీరు తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రకు పోయారా.. మాట్లాడారా?’’ అని హరీశ్‌ ప్రశ్నించారు.