- ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో రేవంత్‌తో సమావేశమైన సభ్యులు
హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో బోధి పెవిలియన్‌లో సీఎం నూతన పాలక మండలితో భేటీ అయ్యారు. ఇటీవలే ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త బోర్డును ప్రకటించింది. ఈ క్రమంలో బోర్డు చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలోని సభ్యులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నూతన పాలక మండలికి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి నుంచి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పారదర్శకమైన పాలనతో యాదగిరిగుట్ట ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. సీఎంను కలిసిన వారిలో బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు ఉన్నారు.
