న్యూఢిల్లీ: నీట్, నెట్‌లలో పదేపదే అవకతవకలు జరుగుతున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ.. మొద్దు నిద్ర పోతోందని కాంగ్రెస్అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ విమర్శించారు. ఇటీవల జరిగిన యూజీసీ-నెట్లో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ బుధవారం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నీట్, నెట్‌లలో పదేపదే కుంభకోణాలు జరుగుతున్నప్పటికీ మోదీ ప్రభుత్వం కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోతోంది. ఎందుకంటే, రాత్రుళ్లు మేల్కొని లక్షలాదిమంది విద్యార్థులు సంవత్సరాల తరబడి పడిన కష్టానికి వారి దృష్టిలో విలువ లేదు’ అని పేర్కొన్నారు. పోటీ పరీక్షలలో జరుగుతున్న అవకతవకల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి జవాబుదారీతనం ఆశించడం వ్యర్థమని యావత్ దేశానికి తెలుసని రాహుల్ అన్నారు.
ఎన్‌టీఏ నిర్వహించిన యూజీసీ-నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి హర్యానాలోని రోహ్‌తక్‌లో విద్యార్థి నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారని పేర్కొన్న ఒక మీడియా నివేదిక స్క్రీన్‌షాట్‌ను రాహుల్తన ఎక్స్అకౌంట్లో పోస్ట్‌చేశారు. ‘గత వారం జరిగిన యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి వెలుగులోకి వచ్చిన తీవ్రమైన ఆరోపణలు అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ అయిన కొద్ది వారాలకే, నెట్ పరీక్షకు సరిగ్గా ముందు 100 పేజీల పీడీఎఫ్ ఒకటి ప్రచారంలోకి వచ్చిందనే నివేదికలు ఇప్పుడు వెలువడుతున్నాయి. ఈ పీడీఎఫ్ ప్రశ్నపత్రం కేవలం ఎన్‌టీఏ వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది. పీడీఎఫ్‌లోని దాదాపు 90 ప్రశ్నలు అసలు సోషియాలజీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నాయి’ అని ఆయన అన్నారు.
బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో ఈ ప్రశ్నపత్రాన్ని రూ. 2.25 లక్షలకు అమ్ముతున్నారని.. అలాగే, సీఎస్ఐఆర్-నెట్, హెచ్‌టీఈటీ, ఏడీఏ వంటి రాబోయే పరీక్షలకు కూడా ప్రశ్నపత్రాలను అందించగలమని అదే నెట్‌వర్క్ చెప్పుకుందని రాహుల్ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై ఎన్‌టీఏ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, వీటిపై ఎలాంటి విచారణ జరగదని, విద్యార్థులకు న్యాయం జరగదని రాహుల్ పేర్కొన్నారు. అలాగే, మార్పునకు ఉన్న ఏకైక సాధనం మనందరి గొంతుక అని, దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించే 'ఛత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల ప్రతిధ్వని) దేశంలో విద్యా విప్లవాన్ని తీసుకువస్తుందని ఆయన స్పష్టం చేశారు.
