- ఎనిమిదేండ్ల తర్వాత యాదాద్రి జిల్లాలో చేనేత సంఘాల ఎన్నికల వేడి
- ఒక్కో సంఘంలో 80 నుంచి 700కు పైగా ఓటర్లు
- 18 సంఘాల్లో 5,818 ఓటర్లు.. ఓటుకు రూ. 4 వేల నుంచి రూ. 10 వేలు.. ఫుల్దావత్లు
- ఏకగ్రీవమైన సంఘాల్లోనూ ఓటర్లకు పేమెంట్
- 10న చేనేత సంఘాలకు ఎన్నికలు
యాదాద్రి, వెలుగు: ఎనిమిదేండ్ల తర్వాత జరుగుతున్న చేనేత సహకార సంఘాల ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు పోటాపోటీగా ప్రలోభాలకు తెరలేపారు. పోలింగ్‌కు ఒక రోజే సమయం ఉండడంతో ఓటర్లకు దండిగా దావతులు ఇస్తూ, డబ్బులు పంచుతున్నారు.
యాదాద్రి జిల్లాలో 23 సంఘాలు ఏకగ్రీవం కావడంతో 18 సంఘాలకు ఈ నెల 10న ఎన్నికలు జరుగున్నాయి. ఒక్కో సంఘంలో 9 మంది చొప్పున 162 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవాల్సి ఉంది. ఒక్కో సంఘంలో 11 నుంచి 24 మంది డైరెక్టర్లుగా పోటీ చేస్తున్నారు. మొత్తంగా 332 మంది పోటీలో ఉన్నారు. ప్రతి సంఘంలో రెండు నుంచి మూడు ప్యానల్స్‌గా ఏర్పడి పోటీలో ఉన్నారు.
దండిగా దావత్లు
ఒక్కో చేనేత సంఘంలో ఓటర్లు 80 నుంచి 700 మందికి పైగా ఉన్నారు. 18 సంఘాల్లో కలిపి మొత్తంగా 5,818 మంది ఉన్నారు. ఓటర్లు లిమిటెడ్‌గా ఉండడంతో ప్రతీ ఒక్కరిని కలిసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గత నాలుగు రోజులుగా మందు, నాన్ వెజ్‌తో దండిగా దావత్లు ఇస్తున్నారు. కొన్ని సంఘాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్యానెల్స్ పోటాపోటీగా దావత్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటుకు రూ. 4 వేల నుంచి రూ. 10 వేలు
పోలింగ్‌కు ఒక్క రోజే సమయముంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో చివరి అంకమైన మనీ పంపకాలకు అభ్యర్థులు రెడీ అయ్యారు. బలంగా ఉన్న భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట సహా కొన్ని సంఘాల్లో ఓటుకు రూ. 4 వేల నుంచి రూ.10 వేల వరకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఓటర్లకు గురువారం రాత్రి వరకూ మనీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ఏకగ్రీవమైన కొన్ని సంఘాల్లో సైతం ఓటర్లకు మనీ పంపకాలు జరిగాయని సమచారం. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారికి కూడా కొంత మొత్తం ఇచ్చినట్టుగా డైరెక్టర్లుగా ఏకగ్రీవమైన వారిలో కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. కాగా, ఈ నెల 10న ఎన్నికలు జరగనుండగా, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించి విజేతలను ప్రకటిస్తారు.
