యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలన మొదలైన ఆరు నెలల్లోనే తీవ్ర విభేదాలు, వివాదాలు వెలుగుచూస్తున్నాయి. మోత్కూరు మున్సిపాలిటీలో రూ. 15 కోట్ల అభివృద్ధి పనుల టెండర్ నోటిఫికేషన్‌ను ఎమ్మెల్యే మద్దతుతో చైర్‌పర్సన్, కమిషనర్ కుమ్మక్కై కమీషన్ల కోసం వేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏకమై అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వరకూ వెళ్లడం, భవన నిర్మాణదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేయడంపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక భువనగిరి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల భర్తలు పాలన, రివ్యూ మీటింగ్‌లలో జోక్యం చేసుకుంటున్నారని, వార్డులకు ఫండ్స్ కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
