సర్కారు బడుల మూసివేత ప్రచారం అబద్ధం: విద్యా శాఖ

సర్కారు బడుల మూసివేత ప్రచారం అబద్ధం: విద్యా శాఖ
  • 112 కొత్త స్కూళ్లు.. వందలాది బడుల పునఃప్రారంభం: నవీన్ నికోలస్
  • కొత్తగా 10 వేల మంది టీచర్ల నియమించినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ బడులు మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

2025– 26 విద్యా సంవత్సరంలో 182 జీరో ఎన్‌‌రోల్‌‌మెంట్ స్కూళ్లను తిరిగి తెరిచామని వెల్లడించారు. అలాగే 2026–27లో ఇప్పటి వరకు మరో 95 స్కూళ్లను పునఃప్రారంభించామని, మరికొన్ని ప్రాంతాల్లో 112 కొత్త ప్రభుత్వ స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. టీచర్ల బదిలీలు, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు.

-2024లో 10,006 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు. 2024 జూన్‌‌లో 21,419 మందికి, 2025 ఆగస్టులో 4,454 మందికి పదోన్నతులు కల్పించామన్నారు. 2024 జూన్‌‌లో 34,706 మంది టీచర్లను బదిలీ చేశామని చెప్పారు. దాదాపు 16 ఏండ్ల తర్వాత డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ద్వారా డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని పేర్కొన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని విద్యా శాఖ తెలిపింది. దీని కోసం రూ.15,600 కోట్లు కేటాయించామని, ఇప్పటికే 78 స్కూళ్లకు అనుమతులు ఇచ్చామని పేర్కొంది. వీటితో పాటు వంద ప్రభుత్వ పాఠశాలలు, 194 మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌‌గా అప్‌‌గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించింది.