బషీర్‌బాగ్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం చనిపోయిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఫ్యామిలీకి బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శంకర్ గౌడ్ సంతాప సభ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు.
ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరుపున రూ.1,00,116, తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి నుంచి రూ.300 చొప్పున సేకరించి మృతుడి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. శంకర్ గౌడ్ మరణించినప్పుడు అండగా నిలవకుండా యూనియన్ నాయకులు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లడాన్ని తప్పుబట్టారు. 36 వేల మంది కార్మికులు ఐక్యంగా ఉంటే ప్రభుత్వం దిగొచ్చేదని తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కేసీఆర్ ప్రభుత్వంలోనే పూర్తయిందని, గవర్నర్ వద్ద ఆగినప్పుడు కూడా కోర్టుల ద్వారా క్లియర్ చేయించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం యూనియన్ ఎన్నికల పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. బకాయిలను క్లియర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు ఆశిస్తోందని విమర్శించారు.
ఏప్రిల్ 25న శంకర్ గౌడ్ చనిపోతే ఇప్పటి వరకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదని, దీంతో ఆయన బిడ్డకు రావాల్సిన ఉద్యోగం ఆలస్యమవుతోందని మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఎలక్ట్రిక్ వాహనాలు నడిపే కెపాసిటీ ఉందని, ప్రభుత్వమే వారికి ట్రైనింగ్ ఇవ్వాలే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు వాటిని అప్పగించవద్దని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ సతీమణి హేమలత, నాయకులు నిరంజన్, పవన్ గౌడ్, సదానందం, బాలరాజ్, రవీందర్ గౌడ్, యాదగిరి, సింగం శ్రీనివాస్ పాల్గొన్నారు.
