- బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
- బొగ్గు గనులపై వేడుకలు
నస్పూర్, వెలుగు: తాడిచర్ల2 కోల్ బ్లాక్ ను ఎలాంటి బిడ్డింగ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని, దీని ద్వారా రూ.2550 కోట్ల ప్రత్యక్ష లాభం సంస్థకు వస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్ఆర్పీ 3 మైన్ వద్ద పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ప్రస్తుత, గత రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణికి ఇవ్వాల్సిన రూ.52 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన కీలక సమయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సింగరేణికి భారీ ఊరటనిచ్చిందన్నారు. 82 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ కోల్ బ్లాక్ 50 నుంచి 60 సంవత్సరాల వరకు మనుగడ సాధిస్తుందని, సింగరేణికి రూ.60 వేల కోట్ల ఆదాయం చేకూరుతుందని అన్నారు.
దీన్ని ప్రారంభించడం ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. స్థానిక నాయకులు సత్రం రమేశ్, కమలాకర్ రావు, మహేందర్ వర్మ, జి.సురేందర్, కె.భీమన్న, శ్రీరాంపూర్ జోన్ ప్రధాన కార్యదర్శి పి.సదయ్య తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి బొగ్గు గనులపై సంబురాలు
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 కోల్‌బ్లాక్‌ను కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని సింగరేణి బొగ్గు గనులపై బీఎంఎస్నేతలు సంబురాలు జరుపుకున్నారు. బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై ప్రధాని మోదీ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి కార్మికులకు స్వీట్లు పంచారు.
బీఎంఎస్ స్టేట్‌వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు నాతాడి శ్రీధర్‌రెడ్డి, గుర్రం ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, మందమర్రి, బెల్లంపల్లిలో బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్రఘునాథ్ వెరబెల్లి, జిల్లా ప్రెసిడెంట్ వెంకటేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
